తమన్నా : సెట్‌లో మహిళలు ఉంటే... కొత్త వారు భద్రతగా, సౌకర్యంగా ఫీలవుతారు.
ABN , Publish Date - Feb 22 , 2026 | 09:40 AM
‘ఆజ్ కీ రాత్’ అంటూ ఒయ్యారాలు పోయినా, ‘రా నువు కావాలయ్యా’ అంటూ ఒంపుసొంపులతో ఆకట్టుకున్నా, ‘స్వింగ్ జరా’ అంటూ శరీరాన్ని స్ప్రింగులా తిప్పినా... తమన్నాకే చెల్లింది.
‘ఆజ్ కీ రాత్’ అంటూ ఒయ్యారాలుపోయినా... ‘రా నువు కావాలయ్యా’ అంటూ ఒంపుసొంపులతో ఆకట్టుకున్నా... ‘స్వింగ్ జరా’ అంటూ శరీరాన్ని స్ప్రింగులా తిప్పినా... తమన్నా (Tamannaah Bhatia)కే చెల్లింది.. అందుకే ఈమధ్య ఐటెమ్‌సాంగ్స్ స్పెషలిస్టుగా ముద్ర వేసుకుంది. మరోవైపు ప్రేమ, బ్రేకప్ (Tamannaah Breakup), వివాదాలతో ఇటీవల తరచూ వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ పంచుకున్న ఆసక్తికర విశేషాలివి...
భావాన్ని అర్థం చేసుకోవాలి
నా దృష్టిలో ప్రత్యేక గీతం అంటే డ్యాన్స్ చేయడం మాత్రమే కాదు. అందులో కూడా భావం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని ప్రేక్షకులపై ప్రభావం చూపించగలగాలి. కొద్ది సేపు తెరమీద కనిపించినా ప్రేక్షకులను మాయ చేయగలగాలి. అది కూడా ఒక కళే. నిజానికి ప్రేక్షకులు సినిమాను మర్చిపోవచ్చేమో గానీ.. పాటలను కచ్చితంగా గుర్తుంచుకుంటారు. ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కి రాత్..’ పాట విడుదలైన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. పదే పదే ఆ పాట వింటున్నట్టుగా చెప్పారు. గత ఏడాది అదే టాప్ సాంగ్. అంటే ఒక పాట ఎంతలా ప్రభావితం చేస్తుందో కదా.
ఎమోషన్ ముఖ్యం
నటనకు ఎలాంటి ఫిక్స్‌డ్ ఫార్ములా ఉండదు. బుక్‌లో చదివి నేర్చుకునే విషయమూ కాదు. క్లాస్‌రూమ్‌లో కెమెరా యాంగిల్స్, ఎక్స్‌ప్రెషన్స్ కంట్రోల్ నేర్చుకోవచ్చు కానీ ఎమోషన్‌ని నేర్చుకోలేరు. మనం ఎంత గమనిస్తామో, ఎంత ఫీల్ అవుతామో... అదే నటనలో గాఢతను తీసుకొస్తుంది. ప్రేమ, ఆనందం, బాధ, వైఫల్యం... ఇవన్నీ నిజంగా అనుభవించినప్పుడే స్క్రీన్ మీద సరిగ్గా చూపగలం. జీవితంలో ప్రతీ అనుభవమూ ఒక పాఠమే. అవే సన్నివేశాలు సహజంగా వచ్చేలా చేస్తాయి.
వాళ్ల ప్రేమ వల్లే...
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి సుమారు తొంభై సినిమాలు చేశాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతీ సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నా. ప్రతీ సినిమా తర్వాత ఏ సన్నివేశం ఎలా చేశాను? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? అని ఆలోచిస్తా. ఇప్పటికీ నేర్చుకోవడం ఆపలేదు. ప్రతీ సినిమా ఒక కొత్త ప్రారంభంలా ఉంటుంది. ఇంత దూరం వచ్చానంటే అది ప్రేక్షకుల ప్రేమ వల్లే. ఆ ప్రేమకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే.
అన్నింటా మహిళలే
నేను పరిశ్రమలోకి వచ్చినప్పుడు సెట్‌లో ఎక్కువగా పురుషులే ఉండేవారు. కెమెరా, లైటింగ్, సాంకేతిక విభాగం... ఇలా అన్నింటా వాళ్లే. ఎక్కడోగానీ మహిళలు కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మహిళలు అనేక విభాగాల్లో కనిపిస్తున్నారు. దర్శకత్వ బృందం, ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్, నిర్మాణ బాధ్యతలు... ఇలా చాలా విభాగాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెట్‌లో మహిళలు ఎక్కువగా ఉంటే... కొత్తగా వచ్చే అమ్మాయిలు మరింత భద్రతగా, సౌకర్యంగా ఫీలవుతారు.

క్యారెక్టర్ మూడ్‌లోకి...
షూటింగ్ ఉందంటే దానికోసం ముందుగా కొంత సన్నద్ధమవుతా. కేవలం మేకప్, కాస్ట్యూమ్ గురించే కాదు... ఒక పాత్ర చేయాలి అంటే ఆ క్యారెక్టర్ మూడ్‌లోకి వెళ్లాలి. అందుకే స్ర్కిప్ట్ మళ్లీమళ్లీ చదువుతా. సీన్‌లో ఎమోషన్‌ను అర్థం చేసుకుంటా. చాలాసేపు సెట్‌లో ఉండాలి కాబట్టి... లైట్ స్ట్రెచింగ్స్, బాడీ మూవ్‌మెంట్స్ చేసి శరీరం యాక్టివ్‌గా ఉండేలా చూసుకుంటా. ముఖ్యంగా షూట్‌కి ముందు రోజు కంటినిండా నిద్రపోతా.
ఫటాఫట్:
చిత్ర పరిశ్రమలో నా స్నేహితుల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే...
సమంత: సపోర్టివ్
కాజల్: స్వీట్‌హార్ట్
మృణాల్ ఠాకూర్: జెన్యూన్
శృతిహాసన్: క్రియేటివ్
తాప్సీ: బోల్డ్
రకుల్‌ప్రీత్ సింగ్: ఎనర్జిటిక్
అనుష్క: ట్రూ ఇన్స్పిరేషన్