సల్మాన్ సంచలన నిర్ణయం.. ఏకంగా రూ.50 కోట్లు తగ్గింపు!

ABN , Publish Date - Aug 02 , 2026 | 08:12 PM

కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరు వింటేనే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం గుర్తుకొస్తుంది. ఆయన సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాల్సిందే. అయితే..

Salman Khan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) పేరు వింటేనే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం గుర్తుకొస్తుంది. ఆయన సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాల్సిందే. అయితే, ఇటీవలి కాలంలో ఆయన నటించిన 'సికందర్', 'టైగర్-3', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న సల్మాన్, టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సంచలనాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ( Sri Venkateswara Creations) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, 2027 ఈద్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా కంటెంట్ కంటే ముందు సల్మాన్ ఖాన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే ఆయన పారితోషికం. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే సల్మాన్ ఖాన్, ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.50 కోట్లు తగ్గించుకుని, కేవలం రూ.70 కోట్ల పారితోషికానికే అంగీకరించారనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే ఇది సల్మాన్ కెరీర్‌లో మొదటిసారి జరిగిన విషయం కాదు. గతంలో కూడా ఆయన పలు సినిమాల్లో రెమ్యునరేషన్ తీసుకోవడం బదులుగా లాభాల్లో వాటా, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే సన్నిహితుల కోసం ప్రత్యేక పాత్రల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ తగ్గింపునకు కారణం కేవలం సినిమా బడ్జెట్ మాత్రమే కాదు. దీని వెనుక ఒక బలమైన వ్యక్తిగత అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను సెటప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత రఫీ కాజీతో సల్మాన్‌కు చాలా కాలంగా ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రాణస్నేహాన్ని, ఆప్యాయతను దృష్టిలో ఉంచుకునే సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. వ్యాపార లాభాల కంటే, కోట్ల రూపాయల పారితోషికం కంటే వ్యక్తిగత బంధాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే మనసున్న వ్యక్తి సల్మాన్ అని సినీ విశ్లేషకులు మరోసారి కొనియాడుతున్నారు. కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా సంబంధాలకు ఇచ్చే విలువతో ఆయన ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందడుగు వేశారు. ఇక వంశీ పైడిపల్లి, దిల్ రాజు, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Aug 02 , 2026 | 09:01 PM