Varun Dhavan: జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు అవే 

ABN , Publish Date - Jan 25 , 2026 | 09:42 AM

బోర్డర్‌’ (boarder 2)ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పటికీ అందులోని పాటలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా దానికి సీక్వెల్‌ ‘బోర్డర్‌ 2’పై ఆసక్తి నెలకొంది. ఈ సీక్వెల్‌లో ఈతరం యువహీరో వరుణ్‌ ధావన్‌ (Varun Dhavan) కీలకపాత్ర పోషించాడు.

భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధ నేపథ్యంతో... 29 ఏళ్ల క్రితం తెరకెక్కిన ‘బోర్డర్‌’ (boarder 2)ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పటికీ అందులోని పాటలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా దానికి సీక్వెల్‌ ‘బోర్డర్‌ 2’పై ఆసక్తి నెలకొంది. ఈ సీక్వెల్‌లో ఈతరం యువహీరో వరుణ్‌ ధావన్‌ (Varun Dhavan) కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా అతడు పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలివి... (Bollywood movie boarder2)

సూపర్‌హిట్స్‌ దక్కినా...

చిన్నప్పుడు నటన మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ‘ఆంఖే’ సినిమా చూసిన తర్వాత నాకు నటుడవ్వాలనే కోరిక కలిగింది. మొదట్లో నాన్న డేవిడ్‌ ధావన్‌ (ప్రముఖ దర్శకుడు), అన్నయ్య రోహిత్‌ ధావన్‌కి (‘దేసీబాయ్స్‌’ దర్శకుడు) నేనసలు ఏం చేస్తున్నానో అర్థమయ్యేది కాదు. నాకు సూపర్‌ హిట్స్‌ దక్కినా... అవి అదృష్టం కొద్దీ వచ్చాయనుకునేవారు. కానీ ‘ఏబీసీడీ 2’, ‘బద్లాపూర్‌’, ‘బద్రీనాథ్‌కి దుల్హనియా’ విజయాల తర్వాత నాపై అభిప్రాయం మార్చుకున్నారు.

నిద్రలేని రాత్రులు గడిపా...

విమర్శలు నాకు కొత్తేమీ కాదు. గతంలో నేను నటించిన చిత్రాలు సూపర్‌ హిట్‌ అయినా ‘ఇంకా మెరుగ్గా చేసుంటే బాగుణ్ణు’ అనే విమర్శలు వినాల్సి వచ్చింది. ఒకప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని. ఆ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఆ ప్రభావం నా కుటుంబసభ్యులపై కూడా పడింది. కానీ ఇప్పుడు విమర్శల గురించి ఆలోచించడం మానేశాను.

ఒకప్పుడు భయం.. ఇప్పుడు ఇష్టం

కొన్నేళ్లు వెనక్కి వెళ్తే... చాలామందిలాగే నాక్కూడా కుక్కలంటే అయిష్టత ఉండేది. నా చుట్టు పక్కల కుక్క కనిపిస్తే చాలు ఆమడదూరం వెళ్లిపోయేవాడ్ని. అలాంటిది ‘భేడియా’ సినిమా షూటింగ్‌ కోసం అరుణాచల్‌ ప్రదేశ్‌ వెళ్లినప్పుడు... అక్కడ చాలా కుక్కలతో గడిపాను. దాంతో కొన్నిరోజులకు వాటి పట్ల నా దృష్టి కోణం మారిపోయింది. భయం పోయి, ప్రేమ పెరిగింది. అప్పట్నుంచే కుక్కల్ని చేరదీయడం ప్రారంభించా. ‘జోయ్‌’ని (మా పప్పీ పేరు) పెంచుకోవడం ప్రారంభించా.


ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు

‘బోర్డర్‌ 2’ అనేది 1971 భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధం, దాని చుట్టూ జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇందులో నేను ‘పరమ్‌ వీర్‌ చక్ర’ గ్రహీత కర్నల్‌ హోషియార్‌ సింగ్‌ దహియా పాత్ర పోషించా. యుద్ధరంగంలో చివరి క్షణం వరకు వెనక్కి తగ్గని ఆయన ధైర్యం, తెగువ... ఇవన్నీ చదవగానే నాకు రొమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆయన రియల్‌ హీరో. అందుకే ‘ఆయన పాత్రకి పూర్తి న్యాయం చేస్తున్నానా?’ అని షూటింగ్‌లో ప్రతీ క్షణం నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. ఇటీవల ఆయన భార్య, కుమారుడ్ని కలవడం, వారి నుంచి ఆశీర్వాదం పొందడం నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు.

పాత్రకు అనుగుణంగా...

సైనికుడి పాత్ర అంటే కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉండటం మాత్రమే కాదు, మానసిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. అందుకే ఎక్కువగా ‘స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌’పై దృష్టి పెట్టా. బబీనా వంటి నిజమైన మిలటరీ లొకేషన్‌లో షూటింగ్‌ చేయడం వల్ల ఒక సైనికుడి మైండ్‌సెట్‌లోకి వెళ్లగలిగాను. అక్కడి వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉండేవి. కాబట్టి దానికి అనుగుణంగా నా శరీరాన్ని సిద్ధం చేసుకున్నా. ఏదేమైనా ఈ పాత్ర నాకు చాలా విషయాలు నేర్పిందనే చెప్పాలి.

ఫటా ఫట్‌

ఫేవరెట్‌ డ్యాన్స్‌ స్టైల్‌: హిప్‌ హాప్‌

ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్‌: అర్జున్‌ కపూర్‌

ఎక్కువ ప్రభావం చూపిన హీరో: సల్మాన్‌

నటుడిని కాకపోయుంటే: డైరెక్టర్‌ లేదా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అయ్యేవాడ్ని

నా గురించి ఎవరికీ తెలియనిది: నేను చాలా ఎమోషనల్‌

నాలో నాకు నచ్చే క్వాలిటీ: క్రమశిక్షణ

కెరీర్‌లో మర్చిపోలేని మూమెంట్‌: నా మొదటి సినిమా విడుదలైన రోజు

Updated Date - Jan 25 , 2026 | 09:42 AM