బ్లాక్ లిస్ట్‌లో.. ధురంధర్ నిర్మాణ సంస్థ! ముంబైలో షూటింగ్స్‌కు.. పర్మిషన్ లేనట్టే!
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:04 PM
'ధురంధర్ 2' షూటింగ్ సమయంలో నిబంధనలను చిత్ర నిర్మాణ సంస్థ ఉల్లంఘించిందని బీఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీని, షూటింగ్ కోసం దరఖాస్తు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బీఎంసీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.
గత యేడాది విడుదలైన హిందీ చిత్రం 'ధురంధర్' (Dhurandhar) సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ యేడాది అదే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ .1400 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'ధురంధర్' చిత్రాన్ని కేవలం హిందీలోనే విడుదల చేసిన ఈ సినిమా దర్శక నిర్మాత ఆదిత్య ధర్ (Adithya Dhar) ఇప్పుడు ప్రధాన భారతీయ భాషల్లో సీక్వెల్‌ను విడుదల చేయడానికి పథక రచన చేస్తున్నారు.
అయితే ఈ సీక్వెల్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవల ముంబైలో చిత్ర నిర్మాణ సంస్థ బి62 స్టూడియోస్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను సంస్థ అతిక్రమించినట్టు గుర్తించిన అధికారులు ఈ నిర్మాణ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా విధించడంతో పాటు అది కట్టిన డిపాజిట్‌ను జప్తు చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ నిర్మాణ సంస్థకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారట.
ముంబైకు చెందిన ఓ ప్రముఖ దిన పత్రిక కథనం ప్రకారం 'ధురంధర్' సినిమా నిర్మాణ సంస్థ బి62 స్టూడియోస్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను బీఎంసీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టడానికి నిర్ణయించుకుంది. ఆ ప్రతిపాదనను జోన్ 1 డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ ఆమోదం తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక పెద్ద కథే నడించిందని అధికారులు చెబుతున్నారు. బీఎంసీ నుండి షూటింగ్‌కు అనుమతి తీసుకున్న ఈ సంస్థ ప్రతినిధులు కోమల్ ప్రోఖియాల్, నాసిర్ ఖాన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ది ప్రధాన ఆరోపణ. అనుమతి లేకుండానే బిల్డింగ్ టెర్రస్ మీద షూటింగ్ చేశారని, ఆ సమయంలో రెండు జనరేటర్ వ్యాన్‌లను వాడారని వారిపై అభియోగం మోపారు.
ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మరోసారి ఇలాంటి తప్పు చేయమని నమ్మబలికి ఫిబ్రవరి 13, 14 తేదీలలో షూటింగ్‌కు వీరు అనుమతి తీసుకున్నారట. మొదట అనుమతి నిరాకరించిన బీఎంసీ అధికారులు ఆ తర్వాత పలు షరతులతో అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 14వ తేదీ అర్థరాత్రి 12.30 నుండి 4.00 గంటల వరకూ షూటింగ్ జరిపిన వీరు ఎలాంటి ప్రేలుడు పదార్థాలు వాడమని హామీ ఇచ్చి కూడా వాటిని ఉపయోగించారని తెలిసింది. ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేయడంతో స్వయంగా షూటింగ్ ప్రదేశానికి వెళ్ళిన బీఎంసీ అధికారి అక్కడ ఉన్న కొన్ని ప్రేలుడు పదార్థాలను స్వాధీన పర్చుకున్నారట.
ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థను, షూటింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరినీ బీఎంసీ అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. వీరికి నోటీసులు జారీ చేయడంతో పాటు వాటి కాపీలను మహారాష్ట్ర ఫిల్మ్ విభాగం, బీఎంసీ బిజినెస్ సెల్ అధికారులకూ పంపారు. 'ధురంధర్ 2' మార్చి 19న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల మేకర్స్‌పై ఉన్న గౌరవం తగ్గే ఆస్కారం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.