సారా అర్జున్.. అలా ఎప్పుడూ చేయదు! అసలు.. 'ఎక్స్'లో ఖాతానే లేదు!
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:09 PM
'టాక్సిక్'పై హీరోయిన్ సారా చేసిన వ్యాఖ్యలుగా జరుగుతున్న ప్రచారానికి ఆమె తండ్రి అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టారు. సారాకు అసలు 'ఎక్స్'లో ఖాతానే లేదని ఆయన తెలిపారు.
బేబీ సారా (Sara)... పలు తమిళ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. యుక్త వయసు లోనూ కొన్ని చిత్రాల్లో నటించిన సారా గత యేడాది డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' (Dhurandhar) మూవీలో రణవీర్ సింగ్ (Ranaveer Singh) సరసన నటించి, మంచి మార్కులు కొట్టేసింది. అలానే తెలుగులో గుణశేఖర్ (Gunasekhar) రూపొందించిన 'యుఫోరియా' (Euphoria) చిత్రంలోనూ ఓ కీలకపాత్రను పోషించి, నటిగా తన సత్తాను మరోసారి చాటుకుంది.
ఇదిలా ఉంటే... ఇప్పుడు అందరి దృష్టి మార్చి 19న రాబోతున్న 'ధురంధర్ 2' సినిమా మీద ఉంది. అదే రోజు విడుదల కావాల్సిన యశ్ 'టాక్సిక్' (Toxic) వాయిదా పడటంతో జాతీయ స్థాయిలో 'ధరంధర్ 2'కు మరింత క్రేజ్ పెరిగింది. తెలుగులో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagath Singh) రెడీ అవుతోంది. ఆ సినిమాను మార్చి 19న విడుదల చేయబోతున్నారు.
గత కొద్ది రోజులుగా సారా అర్జున్ సోషల్ మీడియాలో తనకు సంబంధంలేని విషయంలో ట్రోలింగ్‌కు గురవుతోంది. ఆ విషయమై ఆమె తండ్రి అర్జున్ వివరణ ఇచ్చారు. 'టాక్సిక్' సినిమా వాయిదా పడిన నేపథ్యంలో 'No toxicity, only Dhurandhar' అంటూ ఎక్స్‌లో సారా అర్జున్ ఓ పోస్ట్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. దాంతో తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వేరే చిత్రాన్ని సారా తక్కువ చేసిందంటూ కొందరు విమర్శించారు. ఇది చినికి చినికి గాలివానగా మారకముందే... ఈ విషయమై సారా తండ్రి క్లారిఫికేషన్ ఇస్తూ, 'నిజానికి సారా అర్జున్ ఎక్స్ (ట్విట్టర్)లో లేదని, అది ఫేక్ అక్కౌంట్ అని తెలిపారు. సారా కేవలం ఇన్ స్ట్రాగామ్‌లోనే ఉందని చెబుతూ, 'తన సినిమా గురించి గొప్పగా చెప్పడానికి వేరొకరి సినిమాను తగ్గించే ఆలోచన సారా ఎప్పుడూ చేయదు. మేమంతా సినిమా రంగంలో ఉన్నవాళ్ళమే. దీన్ని ఓ పెద్ద కుటుంబంగా మేం భావిస్తాం. సారాకు ప్రతి నటుడి పట్ల, ప్రతి సినిమా పట్ల గౌరవం ఉంటుంది. తన ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేయడానికి ఇతర వాటిని కించపరిచే ఆలోచన సారాకు ఉండదు. కాబట్టి ఇలాంటి అబద్ధపు సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని ఆమె తండ్రిగా అందరికీ కోరుతున్నాను' అని అర్జున్ చెప్పారు. అలానే కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చబ్రా, సారా అర్జున్ కొత్త ప్రాజెక్ట్ పై వివరణ ఇచ్చారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ఇంతియాజ్ అలీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. సారా అర్జున్ ఎవరి సినిమాకూ సైన్ చేయలేదని, 'ధురంధర్ 2' విడుదల తర్వాతే ఏ సినిమా చేయాలనే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తానే ఆమె కొత్త సినిమాకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తానని, ఈలోగా ఎలాంటి వార్త వచ్చినా... అది ఫేక్ న్యూసే అని ఆయన చెప్పారు.