అక్షయ్ కుమార్ కోసం అర్జిత్ యూ టర్న్!
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:17 PM
సినిమా వాళ్ళ వాగ్దానాలు నీటి మీద రాతలు అని మరోసారి రుజువైంది. సింగర్ అర్జిత్ సింగ్ యూ టర్న్ తీసుకున్నారు. నిజమైన కళాకారుడు ఎప్పుడూ రిటైర్ కాడు... సరైన సమయం, సరైన అవకాశం వచ్చినప్పుడు ఒట్టు తీసి గట్టు మీద పెడతాడని నిరూపించాడు.
ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి వైదొలగుతున్నట్టు సంచలనం సృష్టించిన మెలోడి కింగ్ అర్జిత్ సింగ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అక్షయ్ కుమార్ నటించిన ‘భూత్ బంగ్లా’లోని హార్ట్‌టచింగ్ సాంగ్ ‘తు హి డిస్దా’కు తన గాత్రాన్ని ఇచ్చాడు. ఎమోషనల్ సాంగ్స్‌ను అద్భుతంగా ఆలపించే అర్జిత్ ఎప్పటిలాగే మరోసారి ఈ పాటతో తన అభిమానుల గుండెల్ని గెలుచుకోబోతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పాటను అర్జిత్ స్వయంగా పాడాలని బాలాజీ మోషన్ పిక్చర్స్, సంగీత దర్శకుడు ప్రీతమ్ అతన్ని సంప్రదించారు. పాట వినగానే దానికి కనెక్ట్ అయిన అర్జిత్, అందులోని భావోద్వేగ లోతులను తన స్వరంతో సరిగ్గా అందించగలనని భావించారట. ఆ విషయాన్ని టీమ్‌కు చెప్పడంతో వారు ఆనందంగా అర్జిత్‌కు ఆహ్వానం పలికారు.
ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' లో అక్షయ్ కుమార్, వమికా గబ్బి, పరేష్ రావల్, అస్రానీ, రాజ్‌పాల్ యాదవ్ వంటి తారాగణం నటిస్తోంది. ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే తన క్రేజీ ప్రమోషన్స్‌తో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. అంతేకాక అర్జిత్ పాడిన పాట ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని భావిస్తున్నారు. పాటలు పాడనని చెప్పి, యూ టర్న్ తీసుకున్న అర్జిత్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని పాటలు పాడతాడో చూడాలి.
Read Also: చిరంజీవి ఆశీస్సులతో... తొలి అడుగు!
Read Also: వార్ మూవీస్‌కు ఆదరణ.. వాస్తవాలేమిటీ!?