A. R. Rahman: నా మాట‌లు త‌ప్పుగా అర్థం చేసుకున్నారు

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:20 PM

బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంపై చేసిన వ్యాఖ్యలపై రేగిన వివాదానికి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వీడియో సందేశంతో స్పందించారు.

AR Rehman

బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్ స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించారని స్పష్టం చేస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ.. వీడియోలో రెహమాన్ (A. R. Rahman) మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ ఎవరినీ బాధ పెట్టాలని అనుకోలేదు. భారత్‌ నాకు ఇల్లు. ఇక్కడే సంగీతాన్ని నేర్చుకున్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలే నాకు నిజమైన గురువులు. నేను ఎప్పటికీ దేశాన్ని లేదా ప్రజలను విమర్శించలేదు. భారత్‌ నాకు ఎప్పుడూ స్ఫూర్తే” అని చెప్పారు.

తాను చెప్పాలనుకున్న అసలు అంశం సంగీతం, కళాకారులకు దక్కాల్సిన గౌరవం తగ్గిపోతున్నదనేనని ఆయన వివరించారు. ఒకప్పుడు సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతూ, కమర్షియల్‌ అంశాలే ఎక్కువ అవుతున్నాయని అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను మతంతో ముడిపెట్టి చూడడం సరైంది కాదని, ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కళ, సంగీతం, దేశం పట్ల తన ప్రేమ ఎప్పటికీ మారదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి పలు కారణాలు ఉండొచ్చని, అందులో మతం కూడా ఒక కారణం అయి ఉండవచ్చేమో అన్న భావన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆయనకు మద్దతుగా నిలవగా, మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా మత ప్రస్తావనపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఇప్ప‌టికైనా ఇష్యూ స‌ద్దుమ‌ణుగుతుదో లేక కంటిన్యూ అవుతుందో.

Updated Date - Jan 18 , 2026 | 06:28 PM