Ameesha Patel: హార్దిక్ పాండ్యాతో డేటింగ్..  అమీషా పటేల్ కౌంటర్!

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:09 AM

బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్‌కు (Ameesha Patel) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఆమె కనిపించడంతో.. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ రూమర్స్‌పై అమీషా పటేల్ తాజాగా తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఓ నెటిజన్‌కు ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇటీవల ముంబయిలో జరిగిన ఓ వేడుకకు అమీషా పటేల్, హార్దిక్ పాండ్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా హార్దిక్‌ను అమీషా ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు.. అతడి భుజంపై చేయి వేసి మాట్లాడుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొందరు నెటిజన్లు వారిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. ఓ నెటిజన్ అయితే ఈ వీడియోను ఆధారంగా చేసుకుని అమీషా, హార్దిక్ డేటింగ్‌లో ఉన్నారంటూ పోస్ట్ చేశాడు. దీనిపై అమీషా పటేల్ నేరుగా స్పందించారు. సాధారణంగా స్నేహితులు ఆప్యాయంగా పలకరించుకోవడాన్ని కూడా ప్రేమ, డేటింగ్ అంటూ ప్రచారం చేయడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నీకు గర్ల్‌ఫ్రెండ్ లేదని అర్థమవుతోంది. అందుకే ఒక అమ్మాయి సాధారణంగా పలకరించినా అందులో తప్పు వెతుకుతున్నావు. ఆప్యాయంగా చేయి వేసినా దాన్ని లవ్, డేటింగ్ అని భావిస్తున్నారు. ముందు నువ్వు ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను వెతుక్కో.. ఆ తర్వాత ఇలాంటి ఊహాగానాలు ప్రచారం చేయచ్చు” అంటూ ఆమె ఘాటుగా బదులిచ్చారు. అంతేకాదు.. తాను ఆ కార్యక్రమానికి వెళ్లిన ఉద్దేశం కూడా అమీషా స్పష్టం చేశారు. తన స్నేహితులను హార్దిక్ పాండ్యాకు పరిచయం చేయడానికి మాత్రమే తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. 

Updated Date - Sep 07 , 2026 | 11:46 AM