కాఫీ విత్ కరణ్ 9.. ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోల గ్రాండ్ ఎంట్రీ!
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:48 PM
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే పాపులర్ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ సరికొత్త సీజన్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరించే పాపులర్ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ సరికొత్త సీజన్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఆసక్తికరమైన సంభాషణలు, గాసిప్స్, రాపిడ్-ఫైర్ రౌండ్లతో కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకునే ఈ రియాలిటీ షో వలన వివాదాస్పదమైన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు 8 సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసిన కరణ్.. తాజాగా 9వ సీజన్ ని దీపావళి కానుకగా స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే, ఈసారి రాబోయే కొత్త సీజన్‌లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ నుంచి కూడా ఇద్దరు టాప్ సెలబ్రిటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వారే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ఇప్పటికే గతంలో విజయ్ దేవరకొండ తన లైగర్ చిత్ర ప్రమోషన్ల సమయంలో అనన్య పాండేతో కలిసి ఈ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో విజయ్ ఈ షోలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. విజయ్ మాత్రమే కాకుండా ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, సమంత వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈ వేదికపై మెరిశారు. ఇక ఇప్పుడు విజయ్, అర్జున్.. తమ సినిమాలు అయిన రణబాలి, రాకా సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా.. కరణ్ షోలో మెరవనున్నారు. మొదటిసారి బన్నీ బాలీవుడ్ స్టేజ్ పై కనిపించనుండడంతో అల్లు అర్జున్ ఎంట్రీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సీజన్ 9లో వీరితో పాటు వర్షిప్ స్టార్స్ వరుణ్ ధావన్, కృతి సనన్, సమయ్ రైనా, ఫరా ఖాన్, అనన్య పాండే, షానాయ కపూర్, లక్ష్య, జాన్వీ కపూర్ వంటి అనేకమంది సెలబ్రిటీలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి భారీ చిత్రం రాకా పనుల్లో బిజీగా ఉండగా, విజయ్ దేవరకొండ నటించిన పీరియాడిక్ డ్రామా రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ సీజన్ లో కరణ్.. అల్లు అర్జున్ ని ఎలాంటి వివాదాస్పదమైన ప్రశ్నలు అడుగుతాడో చూడాలి.