Akshay Kumar: అడవుల్లో అక్షయ్ కుమార్ వేట.. జిమ్ కార్బెట్ స్ఫూర్తితో ప్రియదర్శన్ మూవీ
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:34 PM
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay kumar), ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ (Priyadarshan) మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది 9వ సినిమా కావడం విశేషం. ఈసారి ఓ ఆసక్తికరమైన కామిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. 1960ల నాటి భారతదేశం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇందులో అక్షయ్ కుమార్ జిమ్ కార్బెట్ స్ఫూర్తితో రూపొందించిన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం అడవుల్లోనే చిత్రీకరించేందుకు ప్రియదర్శన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
అక్షయ్ ఇందులో వేటగాడిగా, జంతువుల జాడలను పసిగట్టే నైపుణ్యం ఉన్న వ్యక్తిగా ఉంటుందట. అడవి పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత అక్కడ మనుషులను వేటాడే పులులు, చిరుతలను మట్టుబెడతాడు. కాల క్రమేణా అతడి ఆలోచనా విధానం మారుతుంది. వేట, అడవుల నరికివేత వల్ల వన్యప్రాణులకు కలుగుతున్న తీవ్ర నష్టాన్ని గుర్తిస్తాడు. వాటి ఆవాసాలను కాపాడటం ఎంత ముఖ్యమో తెలుసుకుని, చివరకు వన్యప్రాణి సంరక్షణ కోసం పోరాడే వ్యక్తిగా మారతాడు. ఇది సినిమా ఇతివృత్తం. ఈ పాత్ర బ్రిటిష్-ఇండియన్ వేటగాడు, ప్రకృతి శాస్త్రవేత్త, రచయిత జిమ్ కార్బెట్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. కామెడీ, థ్రిల్‌తో పాటు వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ వంటి అంశాలను మిళితం చేస్తూ ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.