'ధురంధర్: ది రివేంజ్' సినిమా.. చివరి వరకూ చూడండి

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:34 PM

'ధురంధర్: ది రివేంజ్' మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇందులోని స్పాయిలర్స్‌ను ఎవరికీ చెప్పొద్దని దర్శక, నిర్మాత ఆదిత్య ధర్‌ కోరుతున్నారు.

Dhurandhar The Revenge

మరికొద్ది గంటల్లో మోస్ట్ అవైటెడ్ హిందీ సినిమా 'ధురంధర్‌: ది రివేంజ్' (Dhurandhar: The Revenge) జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు, నిర్మాణ భాగస్వామి ఆదిత్యధర్‌ ప్రేక్షకులకు ఓపెన్ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు.

'నా అత్యంత ప్రియమైన, అద్భుతమైన 'ధురంధర్' కుటుంబానికి, 2025 డిసెంబర్ 5న 'ధురంధర్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఆ రోజు నుంచి మీరు మా సినిమాను కేవలం చూడలేదు. ఎంతో ప్రేమించారు. మీరు దాన్ని ఓన్ చేసుకున్నారు. ప్రతి చిన్న అంశాన్ని మెచ్చుకున్నారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించారు. మళ్ళీ మళ్ళీ చూశారు. నేను గుర్తించని విషయాలను సైతం మీరు తెలిపారు.

ఆ అందమైన, ఊహించలేని ప్రయాణంలో మా సినిమా మీదైంది. ఆ తర్వాత ఈ దేశానిదైంది... ఆపైన ఈ ప్రపంచానిది అయ్యింది. ఒక దర్శకుడికి దక్కే ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది!? అందుకే 'ధురంధర్ ది రివెంజ్' తీసేటప్పుడు, మిమ్మల్ని ఆశ్చర్యపరచాలి, మీరు ఊహించని భావోద్వేగాలను మీకు కలిగించాలి అని గట్టిగా అనుకున్నాం. అది అంత సులభం కాదు. కానీ మీ కోసం మా శక్తి మేరకు ప్రయత్నించాం. 'ధురంధర్ ది రివెంజ్'లో ప్రతి మలుపు, ప్రతి సంఘటన మీకు గొప్ప అనుభూతిని కలిగించేలా కృషి చేశాం. థియేటర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులు, అపరిచితుల మధ్య కూర్చుని తప్పకుండా అందరూ ఒకే రకమైన భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది.

సినిమాను అలానే చూడాలి. ఫోన్‌లో, అస్పష్టమైన క్వాలిటీతో చూడటం సరికాదు. అయితే ఈ సందర్భంగా మీకో వినతి. దయచేసి స్పాయిలర్స్‌ను బయటపెట్టకండి. ఇతరులతో పంచుకోకండి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌లోకి వెళ్ళి, ప్రత్యేకమైన అనుభూతితో ప్రతి ఒక్కరూ బయటకు రావాలని మేం కోరుకుంటున్నాం. ఇవాళ 'ధురంధర్‌'ను మీరు గొప్పస్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని కాపాడే బాధ్యతను స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను. మీ పట్ల ప్రేమతో, కృతజ్ఞతలతో... భారత్ మాతాకీ జై' అంటూ ఆదిత్య ధర్ ఆ నోట్‌ను పూర్తి చేశారు.


ఇదే సమయంలో ఆయన ఎక్స్‌లో మరో మాట కూడా చెప్పారు.

ఐదు భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చివరి వరకూ చూడాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ రోలింగ్ టైటిల్స్ పూర్తయ్యే వరకూ సీట్ లోనే కూర్చోవాలని ఆయన అంటున్నారు. అంటే... సినిమా చివరిలో ఊహించిన ట్విస్ట్ ఉండొచ్చని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. బహుశా 'ధురంధర్' మరో భాగం కూడా ఉండే ఆస్కారం ఉండొచ్చేమోనని, అదే ఆదిత్య ధర్ చివరిలో చూపించి ఉంటారని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఏదేమైనా... ఈ విశేషాలన్నీ మరి కొద్ది గంటల్లో రివీల్ అయిపోవడం ఖాయం.

Updated Date - Mar 18 , 2026 | 04:05 PM