ఇదెక్కడి మ్యాడ్ కాంబో మామ.. సెట్ అయితే ఇండియన్ స్క్రీన్ బద్దలవడం ఖాయం
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:00 AM
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక పేరు మాత్రమే మారుమోగిపోతోంది. అదే ఆదిత్య ధర్ .
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒకే పేరు మారుమోగిపోతోంది. అదే ఆదిత్య ధర్ (Aditya Dhar). తన తొలి చిత్రం ‘యురి: ద సర్జికల్ స్ట్రైక్’తోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు, ‘ధురంధర్’ తో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించాడు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ, విడుదలయ్యాక మాత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1400 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ‘ధురంధర్-2’(Dhurandhar The Revenge)తో ఆదిత్య ధర్ తన సత్తాను మరోస్థాయికి తీసుకెళ్తూ ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్నాడు.
ప్రిమియర్ షోల నుంచే ప్రభంజనం మొదలుపెట్టిన ‘ధురంధర్-2’, బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. తొలిరోజే ఆల్-టైమ్ రికార్డ్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, లాంగ్ రన్‌లో రూ.2000 కోట్ల మైలురాయిని సునాయాసంగా దాటేలా కనిపిస్తోంది. ఈ సినిమా కథాంశం, మేకింగ్ వాల్యూస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, మూడో భాగం గురించి వస్తున్న వార్తలకు ఈ సినిమాతోనే ఆదిత్య చెక్ పెట్టేశాడు. కథకు ఎక్కడా లీడ్ ఇవ్వకుండా పూర్తి చేయడంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉండబోతుందనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఆదిత్య ధర్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’(The Immortal Ashwatthama). ఈ సినిమా కోసం ఆయన గతంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇందులో బన్నీ కథానాయకుడిగా, జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని అప్పట్లో వార్తలు షికారు చేశాయి. ప్రతి ఒక్కరికీ ఎరుకైన విషయమే ఏంటంటే, బన్నీ తన కథల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కథా చర్చల దశలో చిన్నపాటి అపనమ్మకం కలిగినా ఆ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లరు. అదే కారణంతో ‘అశ్వథ్థామ’ కూడా పట్టాలెక్కకుండా ఆగిపోయింది.
‘ధురంధర్’ చిత్రాల్లో ఆదిత్య చూపించిన అద్భుతమైన మేకింగ్ స్టైల్ చూశాక, టాలీవుడ్ అగ్ర హీరోల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. ‘ధురంధర్-2’ ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆదిత్య అండ్ టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆ వెంటనే ఎన్టీఆర్ కూడా ఈ చిత్రాన్ని కొనియాడుతూ పోస్ట్ పెట్టడం విశేషం. ఈ పరిణామాలు గమనిస్తుంటే, గతంలో ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి ఇద్దరు స్టార్ హీరోలు ఆసక్తిగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఆదిత్య ప్రతిభకు వీరిద్దరి స్టార్ పవర్ తోడైతే ఇండియన్ స్క్రీన్‌పై అద్భుతం జరగడం ఖాయం.
ప్రస్తుతం అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ పాన్-ఇండియా రేంజ్‌లో తిరుగులేని క్రేజ్‌తో ఉన్నారు. వారి నటన, రీచ్ ఏ స్థాయిలో ఉంటుందో ఆదిత్య ధర్‌కు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే, తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం ఆదిత్య మళ్ళీ ఈ ఇద్దరు హీరోలనే సంప్రదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు హీరోలు, ఇటు దర్శకుడు ముగ్గురూ ఒకరి పనితనంపై మరొకరు గౌరవంతో ఉండడం వల్ల, అతి త్వరలోనే ఒక భారీ మల్టీస్టారర్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగితే, ఇండియన్ సినిమా హిస్టరీలో తదుపరి అడుగుగా ఒక మెగా మూవీని మనం చూడబోతున్నాం.