Mahabharat: ఆగస్టు నుంచి.. ఆమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత్''

ABN , Publish Date - Jun 10 , 2026 | 06:18 PM

మహాభారత గాథను సినిమాగా తీయాలని ఉంది అంటూ ఆమీర్ ఖాన్ ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాణానికి ముహూర్తం కుదిరింది.

Mahabharat

మహాభారత గాథను సినిమాగా తీయాలని ఉంది అంటూ ఆమీర్ ఖాన్ (Aamir Khan) ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాణానికి ముహూర్తం కుదిరింది. ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్ను పట్టాలు ఎక్కించనున్నట్లు 'స్క్రీన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. ఆమీర్ నిర్మించిన 'సితారే జమీన్ పర్' ఆర్థిక విజయం సాధించ డంతో ఉత్సాహంలో ఉన్న ఆమీర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించారు.

'మహాభారత కథను కేవలం ఒక్క సినిమాగా చెప్పడం సాధ్య మయ్యే విషయం కాదు. సీరిస్ లాగా వరుసగా సినిమాలు తీయాలి. భారత కథను సినిమాగా తియ్యడం అంటే నిజంగా కత్తి మీద సామే. చాలా కాలంగా ఆ కథ నన్ను వెంటాడుతోంది. ఇప్పుడు సమయం వచ్చింది, సినిమా తీయాలి. అందుకే ఆగస్టు నుంచి పని మొదలు పెడుతున్నా' అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఆమీర్ ఖాన్‌. మహాభారత కథ, ఆమీర్‌ ఖాన్ నిర్మాత, సినిమాలో బోలెడంత మంది స్టార్స్ ఉంటారు. మల్టీస్టారర్ చిత్రాలకు సరికొత్త నిర్వచనం చెప్పే సినిమాలా మహా భారత్ (The Mahabharat) ఉంటుందని ఎవరైనా అనుకోవచ్చు. అయితే స్టార్స్‌తో ఈ సినిమా తీయనని ఆమీర్ ఖాన్ స్పష్టం చేశారు.

సినిమాలో పాత్రలే స్టార్స్. ఇంకా వేరే స్టార్స్ ఎందుకు అంటూ అంతా కొత్త వారితో ఆ సినిమా తీస్తానని సంచలన ప్రకటన చేశారు ఆమీర్ ఖాన్, మహాభారత గాథను సినిమాగా తీసిన తర్వాత తను సినిమాల నంచి తప్పుకొంటానని ఇంతకు ముందే ప్రకటించారు ఆమీర్ ఖాన్, 'ఇది నా కలల ప్రాజెక్ట్. దానికి తెర రూపం ఇచ్చిన తర్వాత నేను చేయడానికి ఇక ఏమీ ఉండదు' అని కూడా ఆయన గతంలో అన్నారు. మరో పక్క దర్శకుడు రాజమౌళి కూడా మహాభారత కథను సినిమా తీయాలని ఉందని గతంలో ప్రకటించారు. మరి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.

Updated Date - Jun 10 , 2026 | 06:30 PM