'లాహోర్‌ 1947' పేరు మార్చలేదన్న ఆమిర్ ఖాన్

ABN , Publish Date - Mar 09 , 2026 | 06:38 PM

లాహోర్ 1947 మూవీ పేరు మార్చడం లేదని ఆ చిత్ర నిర్మాత ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. 'లాహోర్ 1947' పేరును 'బట్వారా 1947'గా మార్చుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

Lahore 1947 Movie

తన చిత్రం 'లాహోర్‌ 1947' (Lahore 1947) టైటిల్ మార్పుపై జరుగుతున్న రూమర్స్‌కు ఆమిర్ ఖాన్ (Aamir Khan) చెక్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా పేరును 'బట్వారా 1947'గా మార్చుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల సెన్సార్ అధికారులు సినిమా పేర్ల విషయంలో చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నారు. దేశాధినేతలు, దేవీ దేవతల పేర్లను సినిమాలకు పెడుతుంటే... వాటిని మార్చుతున్నారు. అందులో భాగంగా 'లాహోర్ 1947'ను 'బట్వారా 1947'గా మార్చితే... సెన్సార్ ఇబ్బందులు ఉండవని కొందరంటున్నారు. దీనిపై ఆమిర్ ఖాన్ స్పష్టతనిచ్చారు. 'మా సినిమా టైటిల్ మార్చలేదు. ఇప్పటికీ దాని పేరు 'లాహోర్‌ 1947'గానే ఉంది. అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను' అని అన్నారు.


అయితే అసలు సమస్య సెన్సార్ నుండి ఎదురు కాలేదని, 'లాహోర్' అనే టైటిల్ దర్శక నిర్మాత సునీల్ దర్శన్ వద్ద ఉందని, దాని హక్కుల కోసం కూడా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ విషయమై పరిష్కారం లభించే ఆస్కారం ఉందని అంటున్నారు. దానితో పాటే లాహోర్ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న నగరం కావడంతో ఆ పేరును సినిమాకు పెడితే... భారతీయులు హర్షించరనే వాదన కూడా ఒకటి ప్రచారంలో ఉంది. అయితే ఇలాంటి ఒత్తిడిలకు తాను లొంగనని ఆమిర్ ఖాన్ తెలిపారు. రాజ్ కుమార్ సంతోషి (Rajkumar Santhoshi) దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రసిద్ధ నాటకం 'జిస్ లాహోర్ నై వెఖ్యా' ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సన్నీడియోల్, షబానా ఆజ్మీ, ప్రీతిజింటా, కరన్‌ డియోల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Updated Date - Mar 09 , 2026 | 06:38 PM