Womens Day Special: వందనాలమ్మా... మీకు వందనాలమ్మా...
ABN , Publish Date - Mar 08 , 2025 | 11:16 AM
ఆకాశంలో సగం మాదే అంటూ సాగుతున్నారు మహిళలు. మగవారికి దేనిలోనూ తీసిపోమనీ చాటుతున్నారు. పురుషాధిక్య ప్రపంచంగా సాగే చిత్రసీమలోనూ తమదైన బాణీ పలికించారు మగువలు.
ఆకాశంలో సగం మాదే అంటూ సాగుతున్నారు మహిళలు. మగవారికి దేనిలోనూ తీసిపోమనీ చాటుతున్నారు. పురుషాధిక్య ప్రపంచంగా సాగే చిత్రసీమలోనూ తమదైన బాణీ పలికించారు మగువలు. మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం (Ineternational Women's Day). ఈ సందర్భంగా సినిమారంగంలో అలరించిన కొందరు దర్శకురాళ్ళ (Female Directors)ను గుర్తు చేసుకుందాం.
ఈ మధ్యే ఆస్కార్ అవార్డుల సందడి సాగింది. అందులో ఉత్తమ చిత్రంగా నిలచిన 'అనోరా'లోని ప్రధానాంశం స్త్రీ స్వేచ్ఛనే!. ఈ నేపథ్యంలోనే అందరూ ఈ సారి విజేతలుగా నిలచిన మహిళలను గుర్తు చేసుకుంటున్నారు. ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్ పొందిన తొలి మహిళగా లినా వర్ట్ ముల్లర్ (Lina Wertmüller) నిలిచారు. 1976లో ఆమె తెరకెక్కించిన 'సెవెన్ బ్యూటీస్'తో నామినేషన్ సంపాదించారు. అప్పటికే అకాడెమీ అవార్డులు ఆరంభమై దాదాపు 48 ఏళ్ళయింది. దీనిని బట్టే అమెరికాలో ఆడవారి పట్ల ఎలాంటి భావన ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మరో 33 ఏళ్ళకు కాని మహిళలు బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకోలేక పోయారు. ఆస్కార్ అందుకున్న తొలి దర్శకురాలిగా కేథరిన్ బిగెలో (Kathryn Bigelow)నిలిచారు. 2009లో ఆమె తెరకెక్కించిన 'ద హర్ట్ లాకర్' ద్వారా కేథరిన్ ఈ గౌరవం దక్కించుకున్నారు. 'ద హర్ట్ లాకర్' వార్ యాక్షన్ థ్రిల్లర్ కావడం మరింత విశేషం! 97 ఏళ్ళ ఆస్కార్ అవార్డుల చరిత్రలో కేవలం తొమ్మిది మంది ఫిమేల్ డైరెక్టర్స్ బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్స్ పొందారు. వారిలో కేవలం ముగ్గురు మాత్రమే విజేతలుగా నిలిచారు. వారిలోనూ జేన్ క్యాంపియన్ ఒక్కరే 1994, 2021లో రెండు సార్లు నామినేషన్స్ పొందిన దర్శకురాలు. 2021లో జేన్ తన 'ద పవర్ ఆఫ్ ద డాగ్'తో బెస్ట్ డైరెక్టర్ గా గెలిచారు. చైనాకు చెందిన ఖ్లో ఝవో (Chloe Zhao) ఆస్కార్ అందుకున్న తొలి ఆంగ్లేతర దర్శకురాలిగా నిలిచారు. 2020లో ఖ్లో తీసిన 'నోమ్యాడ్లాండ్' ఆమెను బెస్ట్ డైరెక్టర్ గా నుంచో బెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది మహిళలు సినిమాలు రూపొందించి తమదైన బాణీ పలికించారు. కొందరు వందల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ తీసిన వారున్నారు. అయితే ప్రపంచంలో అత్యధిక ఫీచర్ మూవీస్ తెరకెక్కించిన ఫిమేల్ డైరెక్టర్ గా మన తెలుగు నటి, దర్శకురాలు విజయనిర్మల (Vijaya Nirmala) గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. 40కి పైగా కథాచిత్రాలు రూపొందించి అలరించారు విజయనిర్మల. తన చిత్రాలలో మహిళ సమస్యలను నేపథ్యంగా తీసుకొని విజయనిర్మల తనదైన బాణీ పలికించడం విశేషం. (Aparna Sen)
ప్రపంచంలో మొట్టమొదట మెగాఫోన్ పట్టిన మహిళగా ఫ్రాన్స్ కు చెందిన అలైస్ గై బ్లాషే నిలిచారు.1896లోనే ఆమె 'ద క్యాబేజ్ ఫెయిరీ' అనే సినిమా తెరకెక్కించారు. ఇక మన భారతదేశంలో ఫాతిమా బేగమ్ అనే నటి తొలిసారి దర్శకత్వం వహించి చరిత్రలో నిలిచారు. వీరి బాటలోనే పయనిస్తూ భానుమతి తెలుగునాట తనదైన బాణీ పలికించారు. తెలుగు సినిమారంగంలో తొలిసారి నటించి, దర్శకత్వం వహించిన ఘనత బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ నిలిచారు. 1953లో ఆమె తెరకెక్కించిన 'చండీరాణి' సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలయింది. మన తెలుగు నుండి రిలీజయిన తొలి పాన్ ఇండియా మూవీగా 'చండీరాణి' చరిత్రలో నిలచింది. ఆ సినిమాకు సంగీత పర్యవేక్షణ, నిర్మాణబాధ్యతలు తీసుకున్నారు భానుమతి. అంతేనా ఆ రోజుల్లోనే అందులో డ్యుయల్ రోల్ లో మురిపించారు భానుమతి. అనేక విషయాల్లో భానుమతిని స్ఫూర్తిగా తీసుకున్న మరోమహానటి సావిత్రి సైతం మెగాఫోన్ పట్టి కొన్ని చిత్రాలు రూపొందించారు. ఆమె దర్శకత్వం వహించిన "మాతృదేవత, చిన్నారి పాపలు, ప్రాప్తం"లో మాతృదేవత ఒక్కటే సక్సెస్ రూటులో సాగడం విశేషం!
ఉత్తరాదిన సైతం ఎందరో నటీమణులు దర్శకత్వం బాటలో తమదైన బాణీ పలికించారు. బెంగాలీ అందాలతారగా పేరొందిన అపర్ణాసేన్ తన తొలి చిత్రం '36 చౌరంఘీ లేన్'తోనే బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. తరువాత 21 ఏళ్ళకు 2002లో తాను తెరకెక్కించిన 'మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్'తోనూ మరోమారు బెస్ట్ డైరెక్టర్ గా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు అపర్ణాసేన్. ఇప్పటి దాకా నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక ఫిమేల్ డైరెక్టర్ గా అపర్ణా సేన్ నిలిచారు. ఇలాంటి నటదర్శకుల బాటలోనే సుహాసిని, రేవతి, జీవిత, శ్రీప్రియ, పూజా భట్ వంటి నటీమణులు మెగాఫోన్ పట్టి ఆకట్టుకున్నారు.
మన దేశంలో ఫిమేల్ డైరెక్టర్స్ అనగానే చప్పున గుర్తుకు వచ్చే పేరు మీరా నాయర్ అనే చెప్పాలి. ఆమె దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్ ఫిలిమ్ 'సలామ్ బాంబే'తోనే అందరి దృష్టినీ ఆకర్షించారామె. మన దేశం నుండి ఆస్కార్ నామినేషన్ సంపాదించిన తొలి చిత్రంగా 1957నాటి 'మదర్ ఇండియా' నిలచింది. ఆ తరువాత 31 ఏళ్ళకు 'బెస్ట్ ఫారెన్ ఫిలిమ్' కేటగిరీలో అకాడమీ నామినేషన్ సంపాదించింది మీరా నాయర్ తీసిన 'సలామ్ బాంబే' అనే చెప్పాలి. ఆ పై కూడా మీరా నాయర్ తనదైన బాణీ పలికిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ సాగారు. 2001లో మీరా నాయర్ తెరకెక్కించిన 'మాన్సూన్ వెడ్డింగ్' వెనిస్ ఫిలిమ్ ఫెస్టివల్ లో అత్యున్నత గోల్డెన్ లయన్ అవార్డు పొందింది. ఇందులోనూ మహిళల మనోభావాలను అందంగా తెరకెక్కించారు మీరా నాయర్. మీరా తరువాత మహిళల మస్తిష్కాకాల్లోని అంతర్ చిత్రాలను తెరకెక్కించిన భళా అనిపించిన దర్శకురాలు దీపా మెహతా అనే చెప్పాలి. దీప ట్రయాలజీ "ఫైర్, ఎర్త్ , వాటర్" విమర్శకుల ప్రశంసలతోపాటు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళల దర్శకత్వంలో రూపొందే చిత్రాల్లో స్త్రీల సమస్యలే ప్రధాన పాత్ర పోషిస్తాయనేది నిర్వివాదాంశం! అందునా ఆఫ్ బీట్ మూవీస్ నే ఫిమేల్ డైరెక్టర్స్ తెరకెక్కిస్తారని చాలామంది అభిప్రాయం. అయితే కొందరు దర్శకురాళ్ళు మాత్రం కమర్షియల్ మూవీస్ తోనూ కనికట్టు చేశారు. అలాంటి వారిలో డాన్స్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఎంతోమందికి స్ఫూర్తి కలిగించారు. ఆమె తెరకెక్కించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ నూ షేక్ చేశాయి.
వీరందరినీ స్ఫూర్తిగా తీసుకొని తెలుగునాట బి.జయ, సుధా కొంగర, నందినీ రెడ్డి, సుచిత్రా చంద్రబోస్, లక్ష్మీ సౌజన్య, గౌరీ రోణంకి, శ్రీవిద్య బసవ, నీరజ కోన వంటివారు మెగాఫోన్ పట్టి తమదైన బాణీ పలికించారు. ఇంకా ఎందరు మహిళలు వీరందరి స్ఫూర్తితో ఫిలిమ్ డైరెక్షన్ లో సాగుతారో చూడాలి.