Jigris Movie Review: జిగ్రీస్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:11 PM
సందీప్ రెడ్డి వంగా వంటి పెద్ద దర్శకుడి సపోర్ట్‌తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన చిత్రం జిగ్రీస్. ఈ సినిమా శుక్రవారం థియేటర్లకు వచ్చింది.
ఈవారం థియేటర్ల వద్ద సినిమాల జాతర సాగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్‌కు పైగా తెలుగు సినిమాలు సందడి చేశాయి. వాటిలో మూడు, నాలుగు మాత్రమే పేరున్న నటుల చిత్రాలు ఉండగా, సందీప్ రెడ్డి వంగా వంటి పెద్ద దర్శకుడి సపోర్ట్‌తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన చిత్రం జిగ్రీస్. ఈ సినిమా శుక్రవారం థియేటర్లకు వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే మంచి ప్రచారంతో యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఓ లుక్కేయండి.
కథ:
కార్తిక్ (కృష్ణ బూరుగుల), ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మనీ వాక) అనే నలుగురు స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉంటారు. ఆపై కాలేజీలు, ఉన్నత చదువులు నేపథ్యంలో వారి మధ్య గ్యాప్ వస్తుంది. నలుగురికీ ఏదో ఒక యాంగర్ మేనేజ్‌మెంట్ కూడా ఉంటుంది. సడన్‌గా నిర్ణయాలు తీసుకోవడం, అరవడం ఇలా నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు. అయితే వీరిలో ప్రశాంత్‌కు అనారోగ్య సమస్య ఉందని తెలుసుకున్న మిత్రులు అదే రోజు రాత్రి తాగిన మత్తులో హడావుడిగా గోవా ట్రిప్ ఫ్లాన్ చేస్తారు. అయితే అప్పటికే బాగా తాగి ఉన్న వారు తమ వద్ద ఉన్న ఫొన్లు, పర్సులు అన్ని ఓ దగ్గర మిస్ చేసుకుంటారు. చేతిలో ఉన్న అరకొర డబ్బులతో కావాలని మారుతీ 800 కారులోనే గోవాకు బయలు దేరుతారు. ఈ క్రమంలో వారి కారు ట్రబుల్ ఇవ్వడంతో పరిస్థితి తలకిందులు అవుతుంది. కిందామీద పడి మెకానిక్‌ను తీసుకురాగా అతని ఎంట్రీతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఆ మిత్రులు చివరకు గోవా చేరుకున్నారా..? అక్కడికే, ఆ కారులోనే ఎందుకు వెళ్లాలనుకున్నారు. మెకానిక్ వళ్ల వచ్చిన సమస్య ఏంటి, ఆ ప్రయాణం వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందనేది మిగిలిన కథ సారాంశం.
విశ్లేషణ:
జిగ్రీస్ అంటూ ప్రాణ స్నేహితుని అర్థం. అలాంటి నలుగురి స్నేహితుల కథే ఈ జిగ్రీస్. ఓ రోజు తాగిన మత్తులో సడన్‌గా గోవాకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం దాని పర్యవసనాల నేపథ్యంలో సినిమా అసాంతం కామెడీతో, అక్కడక్కడ ఎమోషనల్ సీన్లతో ఆకట్టుకుంటుంది. మనం ఇప్పటికే చూసిన ఈ నగరానికి ఏమైంది, హుషారు తరహా కథనమే అయినా ఈ చిత్రం ఈ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండి ఆడియన్స్‌ను చివరి వరకు సీట్లో కూర్చోబెడుతుంది. ముఖ్యంగా నాటుకోడి సీన్, లారీ, కండోమ్ సీన్లు మంచి ఫన్ జనరేట్ చేశాయి. అలాగే మావోయిస్టుల సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. చివరలో ప్రశాంత్ పాత్ర ఇచ్చే ఎమోషనల్ టచ్ కాస్త హృదయాలను తాకుతుంది. అయితే అక్కడక్కడ కాస్త లాగ్ చేసినట్టు అనిపిస్తుంది. కార్తీక్ పాత్ర కనెక్ట్ అయితేనే సినిమా మంచిగా అనిపిస్తుంది.. లేకుంటే తికమక పడడం ఖాయం.
నటీనటులు – టెక్నికల్ టీమ్:
ఇక సినిమాలో అందరికన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది కార్తీక్ పాత్ర గురించే. సినిమా మొత్తం అతని చుట్టే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. తెరపై ఆ క్యారెక్టర్ ఉన్నంత సేపు ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కొదువ ఉండదు. అంతలా అ పాత్రలో కృష్ణ బూరుగుల జీవించేశాడని చప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలాగులతో రఫ్ఫాడించేస్తాడు. మ్యాడ్ ఫేం రామ్ నితిన్ సపోర్టివ్ రోల్‌లో బాగా చేశాడు. ధీరజ్ ఆత్రేయ నేచురల్ కామెడీతో మెప్పించాడు. మనీ వా ఎమోషనల్ పాత్రలోమెప్పించాడు. సుమారు 2.30 గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో ఉన్న రెండు పాటలు ఆకట్టుకుంటాయి. కమ్రాన్ మ్యూజిక్ సినిమాకి బలం చేకూర్చింది. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్‌గా ఉండి లోకేషన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అయితే.. ఈ సినిమాలో హీరోయున్లు, లవ్‌స్టోరీలు లేకపోవడం విశేషమనే చెప్పుకోవాలి. ఎంతసేపు నలుగురి స్నేహితుల మద్యే స్టోరీ రన్ అవుతుంది. ఫ్యామిలీకి కనెక్ట్ అవడం ఏమో గాని కుర్రకారుకు ఇట్టే సినిమా కనెకట్్ అవుతుంది.
ట్యాగ్‌లైన్: ఫన్.. రైడ్!
రేటింగ్: 2.5 /5