Heroines: మనసును, శరీరాన్ని ఆహ్లాదభరితంగా ..
ABN , Publish Date - Jun 08 , 2025 | 09:38 AM
తొలకరి చినుకులు ప్రకృతినే కాదు... మనసును, శరీరాన్ని ఆహ్లాదభరితంగా మారుస్తాయి. వానతో ప్రతీ ఒక్కరికీ పెనవేసుకున్న జ్ఞాపకాలు, అనుభూతులు ఎన్నో
తొలకరి చినుకులు ప్రకృతినే కాదు... మనసును, శరీరాన్ని ఆహ్లాదభరితంగా మారుస్తాయి. వానతో ప్రతీ ఒక్కరికీ పెనవేసుకున్న జ్ఞాపకాలు, అనుభూతులు ఎన్నో. సెలబ్రిటీలైతే బ్యూటీ అండ్ స్కిన్‌కేర్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అలాంటి మాన్‌సూన్ ముచ్చట్లే ఇవి...
మట్టివాసన ఇష్టం...
నిజానికి నాకు వర్షాకాలం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే వర్షాల వల్ల పనులన్నీ పెండింగే. అయితే వర్షం పడటానికి ముందు వచ్చే మట్టివాసన అంటే ఎంతో ఇష్టం. ఆ మట్టి పరిమళం అలా గుప్పుమనగానే... నా బాల్యంలోకి వెళ్లిపోతా. చిన్నప్పుడైతే మంచం మీద దుప్పటి కప్పుకుని వాన చప్పుడు వింటూ కళ్లు మూసుకునేదాన్ని. వర్షం కచేరి చేస్తూంటే ఉరుములు, మెరుపులు పక్కవాయిద్యాలు వాయిస్తున్నట్టు ఫీలయ్యేదాన్ని. అలా వింటూనే నిద్రలోకి జారుకునేదాన్ని. - - - -రష్మిక మందన్నా (Rashmika Mandanna)
కాస్త అప్రమత్తంగా...
వర్షాకాలం మొదలవ్వగానే జలుబు, దగ్గు వెంటనే నన్ను చుట్టుముట్టేస్తాయి. కాబట్టి ముందుగానే కాస్త అప్రమత్తంగా ఉంటా. వర్షాకాలంలో వేసుకొనే పాదరక్షల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో వీటివల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పాదాలను పూర్తిగా కప్పి ఉంచే పాదరక్షలకు బదులుగా... తగినంత గాలి తగిలేలా ఉండే ఫుట్‌వేర్‌ను ఎంచుకుంటా.
- దిశా పటానీ (Disha Patani)
వానపాటలకు డ్యాన్స్ చేస్తా
వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లోనే ఉండి, రెయిన్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేయడమంటే తెగ ఇష్టం. అక్షయ్‌కుమార్ ‘మొహ్రా’ చిత్రంలోని ‘టిప్ టిప్ బర్సా పానీ’ పాటని రిపీట్ మోడ్‌లో పెట్టుకుని మరీ చిందులేస్తుంటా. చిన్నప్పుడైతే కాగితం పడవలు చేసి వీధి కాలువల్లో వదిలి, ఊపిరి బిగపెట్టి చూసేదాన్ని. అవి వేగంగా వెళ్తుంటే కేరింతలు, ఈలలు, చప్పట్లు కొట్టేదాన్ని. నీళ్లలో పడవలు మునిగిపోతే ఎంత దిగులేసేదో.
- నభా నటేష్
లాంగ్ డ్రైవ్‌కి వెళ్తా
నాకు అత్యంత ఇష్టమైన సీజన్ వర్షాకాలం. ఎందుకో తెలీదు కానీ వర్షం పడుతున్నంతసేపు దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. చిన్నప్పుడైతే వీధిలో చేరే వరద నీటిలో ఆడుకోవడం, ఆపై మురికి కాళ్లతోనే ఇళ్లంతా పరుగెత్తడం.. అమ్మ చీవాట్లు... ఇదే తంతు. ఇప్పుడేమో వర్షం మొదలవ్వగానే కారు తీసుకుని సరదాగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లిపోతా. ఒక చేతిలో సమోసా, మరో చేతిలో వేడి వేడి చాయ్ సూపర్ కాంబినేషన్. తొలకరి చినుకుల్ని కిటికీలోంచి చూడటం... అబ్బా... ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను.
- శ్రద్ధా కపూర్
వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తులే...
ఈ కాలంలో మేకప్ ఎక్కువగా వేసుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయం. బయటకి వెళ్లాల్సి వస్తే వాటర్ ప్రూఫ్ ఉత్పత్తులు ఉపయోగించడం బెటర్. కొన్నిసార్లు వర్షంలో తడవాల్సి వస్తుంది. ప్రతీసారీ తలస్నానం చేయడం కుదరకపోవచ్చు. అందుకే డ్రై షాంపు ఉపయోగిస్తుంటా. అలాగే ఈ కాలంలో జుట్టుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. లేదంటే జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.
- దీపికా పదుకొణె