Allu arjun: ఎట్టకేలకు బన్నీ నోట చిరు మాట.. మావయ్యే స్ఫూర్తి
ABN, Publish Date - May 01 , 2025 | 11:54 PM
ముంబయిలో గురువారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన ‘వేవ్స్’ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడారు.
‘‘మా మావయ్య చిరంజీవి 9Chiranjeevi) నాకు స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది’’ అని అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. ముంబయిలో గురువారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన ‘వేవ్స్’ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడారు. మానసిక ప్రశాంతతే తన ఫిట్‌నెస్‌కు కారణమని, సిక్స్‌ప్యాక్ కోసం గతంలో చాలా కష్టపడ్డానని అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘వేవ్స్’ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బాల్యం నుంచే నాకు డ్యాన్స్ ఇష్టం. నటుడిగా నా జర్నీలో ఎన్నో చాలెంజ్‌లు అధిగమించా. అప్పుడు.. ఇప్పుడు సినిమానే నా ప్రపంచం. అది తప్ప మరో ఆలోచన లేదు. ఎంతోమంది నాపై చూపించిన అభిమానం వల్లే ఈ స్థ్థాయికి చేరుకున్నా. ఇప్పటికి సాధించిన తక్కువే. ఇంకా చాలా సాధించాల్సి ఉంది. మా మావయ్య చిరంజీవి నాకు స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు. తదుపరి చిత్రం గురించి చెబుతూ దర్శకుడు అట్లీ చెప్పిన ఐడియా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది’’ అని అన్నారు.
గురువారం మొదలైన వేవ్స్ 2025 కార్యక్రమం మే 4 వరకు కొనసాగనుంది. ఈ వేడుకలో చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్ తదితర తదితరులు పాల్గొని ప్రసంగించారు.
మోదీ ఏ ఛాలెంజ్ అయినా స్వీకరిస్తారు: రజనీకాంత్ (Rajinikanth)
‘‘పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సదస్సు వాయిదా పడే అవకాశాలున్నాయని చాలామంది అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకంతో ఈ సమ్మిట్ అనుకున్న సమయానికే జరుగుతుందని అనుకున్నా. మోదీ ఏ ఛాలెంజ్ అయినా స్వీకరిస్తారు. కశ్మీర్‌లో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మోదీ ఓ ఫైటర్. వేవ్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ వేడుక నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు.
సినిమా అంతా ఒక్కటే: మోహన్‌లాల్
‘‘మలయాళ చిత్ర పరిశ్రమ కళలకు నిలయం. వినోదాన్ని అందించడమే కాకుండా కమర్షియల్‌గానూ విజయాన్ని అందుకున్న ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. నా 47 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎంతో మంది గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది. యువ దర్శకులతోనూ వర్క్ చేస్తున్నా. ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నా మలయాళ సినిమాలను ఆర్ట్ ఫిల్మ్స్ అని పిలిచేవారు. కాబట్టి, ఆర్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్స్ అంటూ వేరు చేసి చెప్పలేను. సినిమా అంతా ఒక్కటే’’ అని మోహన్‌లాల్ అన్నారు.
ఏ దేశం ఇండియాకు సాటి రాదు: రాజమౌళి
‘‘మన దేశంలో చాలా భాషలున్నాయి. ఒక్కో దానికి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. ఎన్నో కళలున్నాయి. లెక్కలేనన్ని కథలున్నాయి. కథల విషయంలో ఏ దేశం ఇండియాకు సాటి రాదు. అంతర్జాతీయంగా యూఎస్‌ఏ, సౌత్ కొరియా, చైనా తదితర దేశాలతో మనం సమానంగా లేం. మన శక్తిపై నాకెలాంటి సందేహం లేదు. కానీ, మనకు ఓ గొప్ప వేదిక అవసరం. అలాంటిదే ఈ ‘వేవ్స్’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పారు.