His Story Of Itihaas: హిస్టరీ పుస్తకాల వెనకున్న చరిత్ర ఏమిటీ...
ABN , Publish Date - May 19 , 2025 | 01:50 PM
మెకాలే మానస పుత్రులు రాసిన చరిత్ర పుస్తకాలనే ఇప్పటికీ మన పిల్లలతో బట్టీ పట్టిస్తారని విమర్శిస్తున్న వారు చాలామంది ఉన్నారు. విద్యావిధానం మారాలని, చరిత్ర పేరుతో బోధిస్తున్న అసత్యాలను తొలగించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం 'హిజ్ స్టోరీ ఆఫ్ ఇతిహాస్'.
వాస్కోడి గామా భారతదేశాన్ని కనుగొన్నాడు...
టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమర యోధుడు...
అక్బర్ గొప్ప చక్రవర్తి...
ఆర్యులు విదేశీయులు...
ఈ విషయాలను కొన్ని దశాబ్దాలుగా చరిత్ర పుస్తకాలలో చదువు తున్నారు భారతీయులు. కానీ ఇందులో వాస్తవం ఎంత? వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన బ్రిటీష్ వారు, మేధావులుగా తమని తాము చెప్పుకునే చరిత్రకారులు రాసిన చారిత్రక పుస్తకాలనే ఇప్పటికే వల్లె వేయాలా? చాలామందిలో కలిగే ప్రశ్న ఇది. నిజంగానే మనం మన చరిత్రను, మన సంస్కృతి, సంప్రదాయాలను పాఠశాలలో చదువుతున్నామా? గత కొన్ని తరాలుగా విద్యార్థులకు చరిత్రపేరుతో అబద్ధాలను నూరిపోయడం లేదు కదా! అనే సందేహం కొన్ని చరిత్ర పుస్తకాలు, అందులోని కొన్ని పాఠాలు చదివితే కలిగే సందేహం. ఇదే తరహా సందేహం ఓ ఫిజిక్స్ లెక్చరర్ కు వచ్చినప్పుడు అతనేం చేశాడు? తన కూతురు చదువుతున్న చరిత్ర పుస్తకాలను చూసి ఎందుకు కలత చెందాడు? నిజమైన చరిత్రను తెలుసుకునేందుకు, ఈ తరానికి తెలియచేసేందుకు ఎలాంటి కృషి చేశాడు? అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా 'హిజ్ స్టోరీ ఆఫ్ ఇతిహాస్' (His Story of Itihaas). హిందీలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతోంది. భారతీయ విద్యావిధానంలో ఎలాంటి మార్పులు రావాలి, నిజమైన చరిత్రను ఎందుకు అధ్యయనం చేయాలనే విషయాలను ఈ సినిమాలో చూపించినట్టు మూవీ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా 'హిజ్ స్టోరీ ఆఫ్ ఇతిహాస్' చిత్రాన్ని తెరకెక్కించినట్టు దర్శక నిర్మాత మన్ ప్రీత్ సింగ్ ధామి (Manpreet Singh Dhami) తెలిపారు. ప్రముఖ మరాఠా నటుడు సుబోధ్ భావే (Subodh Bhave) తో పాటు ఆకాంక్ష పాండే (Akansha Pandey), కిషన్ అరోరా (Kishan Arora), అంకుర్ వికాల్ (Ankur Vikal), యోగేంద్ర టిక్కు ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమా గురించి దర్శకుడు మన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ''దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ మీద కృషి చేస్తూ వచ్చాను. ప్రతి సన్నివేశాన్ని ఎంతో సాధికారికతతో తెరకెక్కించేందుకు చాలా అధ్యయనం చేయాల్సి వచ్చింది. భారతీయ విద్యావిధానం గురించి, మనకు బోధిస్తున్న చరిత్ర గురించి ఈ సినిమాలో కూలంకషంగా చర్చించాం. తప్పకుండా ఈ ప్రజలను ఆలోచింప చేస్తుందని నమ్ముతున్నాను'' అని అన్నారు.
Also Read: Suriya - Venki Atluri: పూజా కార్యక్రమాలతో సూర్య ద్విభాషా చిత్రం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి