Yugandhar Tammareddy: ఆస్కార్ అకాడమీలో.. తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్
ABN , Publish Date - Jun 30 , 2025 | 10:47 AM
ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి ఎంపికయ్యారు.
ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కమిటీలో ( Oscars committee) సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ (VFX Supervisor) యుగంధర్ తమ్మారెడ్డి (Yugandhar Tammareddy) ఎంపికయ్యారు. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) రంగంలో విశేష కృషి చేసిన యుగంధర్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ Academy of Motion Picture Arts and Sciences (AMPAS) లో 2025 క్లాస్‌లో సభ్యుడిగా చేరడంతో అంతర్జాతీయ స్థాయిలోఆయన గుర్తింపును సాధించారు. ఇప్పటివరకు 125కి పైగా చిత్రాలకు పని చేసిన ఆయన తన అద్భుత ప్రతిభతో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
1999లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన యుగంధర్ నాటి నుంచి తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగాన్ని కొంత పంతలు తొక్కించాడు. ఆ రంగంలో నిరంతరం నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. రంగస్థలం చిత్రంలో గ్రామీణ నేపథ్యాన్ని సజీవంగా తీర్చిదిద్దిన విజువల్స్, అల వైకుంఠపురము, దేవరలో యాక్షన్ సన్నివేశాల విజువల్స్ తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాక, దేశ వ్యాప్తంగా యుగంధర్‌కు మంచి పేరును తీసుకు వచ్చాయి.
ఇదిలాఉంటే.. ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఇటీవల విడుదల చేసిన కొత్త కమిటీ సభ్యుల జాబితాలో భారత్ నుంచి కమల్ హాసన్ (Kamal Haasan)తో పాటు నటుడు ఆయుష్మాన్ ఖురానా, దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు ఉన్నారు. పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో వీరు పాలు పంచుకోనున్నారు. దీంతో అకాడెమీ 2025 కమిటీలో యుంధర్ ఎంపికతో తెలుగు సినిమాకే కాకుండా మొత్తం భారతీయ వీఎఫ్ఎక్స్ రంగానికి గర్వకారణమని, మరో సారి భారతీయుడి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారని ఆయనను కొనియాడుతున్నారు. అన్ని ఇండస్ట్రీల నుంచి ఆయనకు ప్రశంసల వెళ్లువెత్తుతున్నాయి.ఇకపై మన సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అంటున్నారు.