Naa Anveshana: సీత, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు.. తప్పుచేస్తే రక్తం కక్కుకొని చస్తా
ABN , Publish Date - Dec 29 , 2025 | 08:47 PM
చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని పోస్ట్ చేయకూడదు. ఆ ఫాలోవర్స్ కి అందలం ఎక్కించడమూ తెలుసు.. తేడా వస్తే అధః పాతాళానికి తొక్కడమూ తెలుసు.
Naa Anveshana: చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని పోస్ట్ చేయకూడదు. ఆ ఫాలోవర్స్ కి అందలం ఎక్కించడమూ తెలుసు.. తేడా వస్తే అధః పాతాళానికి తొక్కడమూ తెలుసు. ఈ విషయం తెలుసుకున్నవారు స్టేజిల మీద.. మైక్ ల ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకున్నారు. కానీ, కొందరు మాత్రం ఇంకా రెచ్చిపోతున్నారు. అందులో నా అన్వేషణ (Naa Anveshana)అనేయూట్యూబ్ ని నడుపుతున్న యూట్యూబర్ అన్వేష్ ఒకడు. ప్రపంచ యాత్రికుడు అనే పేరుతో అన్ని దేశాలను తిరుగుతూ అక్కడ ఫుడ్, వాళ్ళ ఆచారాలను చెప్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానెల్ లో పలు అంశాల మీద తన అభిప్రాయాలను చెప్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో బెట్టింగ్ యాప్ ల గురించి మాట్లాడి అన్వేష్ హైలైట్ అయ్యాడు. ఆ సమయంలోనే చాలామంది అతనికి ఫ్యాన్స్ అయ్యారు. సోషల్ మీడియాలోని ఫాలోవర్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు అన్నది అవివేకం. తాజాగా అన్వేష్ కి కూడా ఈ విషయం తెలిసొచ్చింది. నటుడు శివాజీ ఆడవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై అన్వేష్ స్పందించాడు. అసభ్యపదజాలంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. అంతవరకు ఓకే. ఆ వివాదంలోకి గరికపాటి నరసింహారావును లాగాడు. ఆయనను బూతులతో దూషించాడు.
అక్కడితో ఆగినా బావుండేది.. హిందూ దేవతలను తీసుకొచ్చాడు. సీతమ్మ, ద్రౌపదిలను బలత్కారం చేసిన కీచకుడు, సైంధవుడు మరణించలేదా.. ? అని మాట్లాడాడు. గుడుల ముందు అర్ధనగ్న శిల్పాలు ఉంటాయి.. వాటిని తొలగించమని చెప్పండి అంటూ మండిపడ్డాడు. ఇలా ఒకటి అని కాదు.. నోటి దురదతో చాలానే మాటలు జారాడు. రామాయణం, మహాభారతం గురించి మాట్లాడడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. కేసులు కూడా పెట్టాయి. అంతేనా అతడి పద్దతి నచ్చక ఫాలోవర్స్ తగ్గడం మొదలయ్యింది. దీంతో చేసేది లేక అందరికీ సారీ చెప్పాడు.
'సీతాదేవికి, ద్రౌపది దేవికి క్షమాపణలు చెప్పమంటున్నారు. అదే చేత్తో శివాజీకి, గరికపాటి గారికి క్షమాపణలు, హిందూ సంఘాలకు చెప్పమన్నారు. వినాయకుడి సన్నిధానంలో నేను వారందరికీ క్షమాపణలు కోరుతున్నాను. దానికన్నా ముందు నేను ఏమన్నా.. ద్రౌపది దేవిని బలత్కారం చేయబోయిన కీచకుడు, సైంధవుడు చచ్చిపోయారు అని చెప్పాను. తరువాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లబోయి చచ్చిపోయాడు అన్నాను. ఇక్కడ అలా చేస్తున్నవారు బిర్యానీలు తింటూ దర్జాగా ఉంటున్నారని అన్నాను. అక్కడ అంత చెప్పడానికి లేదు కాబట్టి చెప్పలేదు. తప్పు దొర్లింది.. నేను ఒప్పుకుంటున్నా. అందుకే క్షమాపణలు కోరుతున్నా.. నాదే తప్పు అయితే ఈ రాత్రికి రక్తం కక్కుకొని చచ్చిపోతా.. అదే ఈ తప్పును మీరు క్షమించకపోతే ఈ ఏడాది అంతా అష్టదరిద్రాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతారు. గరికపాటి గారికి, శివాజీగారికి కూడా సారీ చెప్తున్నా.. నేనన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.