Yellamma: ప్రీ గ్లింప్స్.. అన్నింటికి చెక్ పెడుతుందా

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:56 PM

ఏ దర్శకుడికైనా మొదటి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధిస్తే, ఆ తరువాత తీసే సినిమాకు అంచనాలు ఆకాశాన్నంటుతాయి. కానీ, ఈ సాధారణ సూత్రాన్ని కాస్త పక్కకు నెట్టి, దర్శకుడు వేణు (Venu Yeldandi) పరిస్థితి భిన్నంగా ఉంది.

Yellamma

Yellamma: ఏ దర్శకుడికైనా మొదటి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధిస్తే, ఆ తరువాత తీసే సినిమాకు అంచనాలు ఆకాశాన్నంటుతాయి. కానీ, ఈ సాధారణ సూత్రాన్ని కాస్త పక్కకు నెట్టి, దర్శకుడు వేణు (Venu Yeldandi) పరిస్థితి భిన్నంగా ఉంది. బలగం వంటి సున్నితమైన, నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చిత్రంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వేణు..తన తదుపరి చిత్రం కోసం ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. వేణు సిద్ధం చేసుకున్న ఈ కథ మొదట్లో పెద్ద హీరోల వద్దకు వెళ్ళింది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన నాని, నితిన్‌, శర్వానంద్ వంటి వారికి ఈ స్క్రిప్ట్ గురించి వివరించారు. వారంతా మొదట్లో ఈ కథపై ఆసక్తిని కనబరిచారు. అయితే, ఎందుకో తెలియదు గానీ, అది కార్యరూపం దాల్చడం మాత్రం సాధ్యపడలేదు. ప్రతిసారీ అడుగు ముందుకు పడినట్లే కనిపించినా.. ఆఖరుకు ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఆగిపోయింది.

ఫైనల్‌గా.. ఈ ప్రతిష్టాత్మక కథ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ వద్దకు చేరింది. ఈ సినిమాతోనే దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా తన స్థానం నుంచి హీరోగా టాలీవుడ్‌ తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిజానికి, దేవి శ్రీ ప్రసాద్‌ హీరోగా రాబోతున్నాడనే వార్తలు గతంలోనూ ఎన్నో సార్లు వినిపించాయి. అవి కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. అయితే, ఈసారి పరిస్థితి వేరు. కేవలం వార్తలతో ఆగిపోకుండా, ఏకంగా సినిమాకు సంబంధించిన ప్రీ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు దిల్‌ రాజుతో పాటు వేణు టీం సన్నాహాలు చేస్తుంది. దిల్‌ రాజు వంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించనుండడం ప్రాజెక్ట్ స్థాయిని తెలియజేస్తోంది. ఈ గ్లింప్స్‌కు సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం దానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు చురుగ్గా నడుస్తున్నాయని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం.. దేవి శ్రీ ప్రసాద్‌ హీరోగా మారబోతున్నాడనే వదంతులకు బలంగా చెక్‌ పెడుతున్నట్లైంది.

ఈ గ్లింప్స్‌ విడుదలైన తరువాత, వచ్చే ఏడాది ఆరంభం నుంచే ఈ సినిమా రెగ్యులర్ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. దర్శకుడు వేణు బలగం తరువాత మరింత బలమైన కమర్షియల్ ఎమోషన్‌ను చూపించబోతున్నాడనే అంచనాలు ఉన్నాయి. ఇక, హీరో విషయంలో ఈ స్థాయిలో స్పష్టత వచ్చినా, హీరోయిన్‌ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మొదట్లో ఈ రేసులో సాయి పల్లవి, కీర్తి సురేష్‌ వంటి అగ్ర తారల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం, వాళ్లెవరూ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో లేరని తెలుస్తోంది. వేణు టీం, దేవి శ్రీ ప్రసాద్‌కి జోడీగా సరికొత్త నాయికను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్‌. మొత్తం మీద, ఎల్లమ్మకు సంబంధించిన ఈ గ్లింప్స్‌ విడుదల కాగానే, ఈ సినిమా చుట్టూ ఉన్న సందేహాలన్నింటికీ పూర్తి క్లారిటీ వస్తుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్‌ నటుడిగా తన అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటాడో, వేణు రెండో సినిమాతో ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి.

Updated Date - Dec 19 , 2025 | 04:04 PM