Tollywood Heroines: కొత్త ఏడాదిపైనే కుర్ర హీరోయిన్ల ఆశలు..

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:41 PM

సినిమా రంగంలో గ్లామర్ ప్రపంచం ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో, అంతే వేగంగా మారిపోతుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ విషయంలో టైమ్ అనేది చాలా ముఖ్యం.

Tollywood Heroines

Tollywood Heroines: సినిమా రంగంలో గ్లామర్ ప్రపంచం ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో, అంతే వేగంగా మారిపోతుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ విషయంలో టైమ్ అనేది చాలా ముఖ్యం. ఒక్క హిట్ వస్తే రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు, అదే వరుస ఫ్లాపులు వస్తే కనుమరుగవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టదు. ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోయిన్లు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నారు. వారే బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde).. డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela).

ఒకప్పుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో గోల్డెన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ పూజా హెగ్డే. అగ్ర హీరోలందరితో ఆడిపాడిన ఈ భామకు అల వైకుంఠపురములో తర్వాత టైమ్ అంతగా కలిసి రాలేదు. రాధేశ్యామ్, ఆచార్య, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈమె కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా, చేతిలో ఉన్న ప్రాజెక్టుల నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత దుల్కర్ సల్మాన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

ఇక మరోవైపు శ్రీలీల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. పెళ్లిసందడి, ధమాకా చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు, ఒక్క ఏడాదిలోనే అరడజనుకు పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది. కానీ దురదృష్టవశాత్తూ గుంటూరు కారం మినహా మిగిలిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ క్రేజీ హీరోయిన్ ఫేడవుట్ అయ్యే దశకు చేరుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ ఇద్దరు సుందరీమణులకు రాబోయే సంక్రాంతి అగ్నిపరీక్షగా మారబోతోంది. విశేషమేమిటంటే, వీరిద్దరూ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. దళపతి విజయ్ కెరీర్‌లో ఆఖరి చిత్రంగా వస్తున్న జననాయగన్ లో పూజా హెగ్డే నటిస్తుండగా.. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న పరాశక్తితో శ్రీలీల తమిళంలో ఎంట్రీ ఇస్తోంది.

ముఖ్యంగా ఈ రెండు సినిమాలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవే కావడం గమనార్హం. విజయ్ వంటి స్టార్ హీరో సరసన నటించడం పూజా కెరీర్‌కు మళ్ళీ జీవం పోస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే శ్రీలీలకు కోలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే పరాశక్తి విజయం ఎంతో కీలకం. అందుకే వీరిద్దరూ తమ లుక్స్ విషయంలోనూ, ప్రమోషన్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న పొరపాటు జరిగినా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతో, సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొత్త ఏడాదిలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమ పూర్వ వైభవాన్ని అందుకుంటారా? సంక్రాంతి రేసులో ఎవరు విజేతగా నిలుస్తారు? జననాయగన్ పూజాకు లైఫ్ ఇస్తుందా లేక పరాశక్తి శ్రీలీలను కాపాడుతుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - Dec 31 , 2025 | 05:46 PM