Akhanda 2: అఖండ 2 ఆగిపోవడం వెనక పెద్ద కథే ఉంది..
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:58 PM
'అఖండ 2: తాండవం' చిత్రం కోసం పాన్ ఇండియా స్థాయిలో ఎదురు చూస్తున్నారు. గురువారం రాత్రి ప్రీమియర్ షోస్ పడాలి, శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కావాలి. కానీ అనివార్య కారణాల సినిమా విడుదల ఆగిపోయింది. అభిమానులు నిరుత్సాహపడ్డారు.
'అఖండ 2: తాండవం' (Akhanda 2: Thandavam) చిత్రం కోసం పాన్ ఇండియా స్థాయిలో ఎదురు చూస్తున్నారు. గురువారం రాత్రి ప్రీమియర్ షోస్ పడాలి, శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కావాలి. కానీ అనివార్య కారణాల సినిమా విడుదల ఆగిపోయింది. అభిమానులు నిరుత్సాహపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధర పెంచుకోవడానికి, ప్రీమియర్లకు అనుమతినిచ్చాయి. ఇక ప్రీమియర్స్ పడటానికి సమయం అయింది అనుకుంటున్న సమయానికి క్యాన్సిల్ అనే వార్త, కాసేపటికి సినిమా వాయిదా అని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటన చేసింది. ఇది బాలయ్య అభిమానులకు చేదు వార్తే. అసలు రిలీజ్ ఆగడానికి కారణాలేంటి? (Akhanda movie)
‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు ఈ నెల 3న స్టే ఇచ్చింది. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ తమకు డబ్బులు ఇవ్వాలని తమ బాకీలు తీర్చే వరకు సినిమా విడుదలపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ‘అఖండ 2’కు డబ్బులు సమకూర్చిన ఫైనాన్షియర్లు సైతం సినిమా విడుదలకు అడ్డు పడే అవకాశం ఉందని ముందు నుంచీ వార్తలొచ్చాయి. దాంతోపాటు ఈ సినిమా కోసం నిర్మాతలకు ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మరో ముగ్గురు ఫైనాన్స్ చేశారు. వాళ్ళ అమౌంట్ ఇంకా సెటిల్ కాలేదని టాక్ నడుస్తోంది. ల్యాబ్ క్లియరెన్స్ రాలేదని తెలిసింది. ఎరోస్ సంస్థతోనే కాకుండా ఫైనాన్షియర్లతోనూ ఇష్యూ ఉందని తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్, ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య గొడవ ఏమిటి? ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ‘సర్కారు వారి పాట’ విడుదల అయినప్పుడు, ‘అఖండ 2’ ఎందుకు ఆగింది? అంటే... ఈ సమస్య ఇప్పటిది కాదు. 14 రీల్స్ ప్లస్, ఎరోస్ మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవట. కానీ 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట భాగస్వాములు అయిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనిల్ సుంకర మరో భాగస్వామి. మహేష్ బాబు ‘దూకుడు’ నిర్మాణంలో ఎరోస్‌తో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అదే సమయంలో 14 రీల్స్, ఎరోస్ మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. అక్కడి నుంచే గొడవలు మొదలయ్యాయి. అది కాస్త పెద్దదైంది. కానీ ‘సర్కారు వారి పాట’ విడుదల సమయంలో మౌనంగా ఉన్న ఎరోస్ ఇప్పుడు ‘అఖండ 2’ విడుదల మీద స్టే కోరింది. తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది.
14 రీల్స్ లేదా 14 రీల్స్ ప్లస్ ఎరోస్ సంస్థల మధ్య కేసులు కొన్నేళ్లగా సాగుతున్నాయి. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కొన్నేళ్ల క్రితం ఎరోస్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాని సవాల్ చేస్తూ 2020లో మద్రాస్ హైకోర్టుకు, 2021లో డివిజన్ బెంచ్, ఆగస్టు 2021లో సుప్రీమ్ కోర్టుకు 14 రీల్స్ వెళ్ళింది. కానీ ఒక్క రూపాయి కట్టలేదు. పైగా 14 రీల్స్ సంస్థకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఇప్పుడు ‘అఖండ 2’ విడుదలపై ఎరోస్ స్టే కోరగా... 14 రీల్స్ ప్లస్ సంస్థపై తీసిన సినిమా అని నిర్మాత కోర్టుకు తెలిపారు. అయితే... 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ వేర్వేరు కాదని, రెండు సంస్థలూ రామ్ ఆచంట, గోపి ఆచంట వే అని ప్రూవ్ చేయడంలో ఎరోస్ సక్సెస్ అయ్యింది. దాంతో 28 కోట్ల రూపాయలకు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆ డబ్బులు కట్టడంతో పాటు లోకల్ ఫైనాన్షియర్లకు కట్టాల్సిన మొత్తం చెల్లిస్తేనే సినిమా విడుదలకు నోచుకుంటుంది.
ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు ఇలాంటి ఇబ్బంది ఎదురైంది లేదు. కానీ ‘హరి హర వీరమల్లు’ సినిమా స్పెషల్ షోస్ సాయంత్రం పడాల్సినప్పుడు ఇలాంటి వాతావరణమే ఎదురవ్వగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో ఇష్యూ క్లియర్ చేశారు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది అంతా అనుకున్నారు కానీ ప్రీమియర్లు రద్దు అయ్యాయి. సినిమా సైతం 5వ తేదీ అనుకున్నట్టుగా థియేటర్లలో పడలేదు.