Vennela Kishore: వెన్నెల కిషోర్ కమెడియన్ అవ్వడానికి పవన్ కు సంబంధం ఏంటబ్బా
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:15 PM
తలరాతలో ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. కాకపోతే దానికి సమయం పడుతుంది. అప్పటివరకు ఆగడం మాత్రమే మనిషి చేసే ఒకే ఒక్క పని.
Vennela Kishore: తలరాతలో ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. కాకపోతే దానికి సమయం పడుతుంది. అప్పటివరకు ఆగడం మాత్రమే మనిషి చేసే ఒకే ఒక్క పని. ఇండస్ట్రీలో ఎంతోమంది డాక్టర్ ను కాబోయి యాక్టర్ అయ్యా.. డైరెక్టర్ కాబోయి హీరో అయ్యా.. కమెడియన్ కాబోయి రచయిత అయ్యా..లాంటి మాటలు వింటూనే ఉంటాం. అలాంటివి విన్నప్పుడు కామెడీగానే ఉంటాయి కానీ, అలాంటివారు సక్సెస్ అయ్యి స్టార్స్ గా కొనసాగుతుంటే మాత్రం దేవుడు లీలలు చాలా అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. డబ్బులు లేక ఒక డైరెక్టర్ ఫ్రీగా నటించడానికి తన ఫ్రెండ్ ను తీసుకొస్తే.. ఆ ఫ్రెండ్ నే ఇప్పుడు స్టార్ కమెడియన్ గా చక్రం తిప్పుతున్నాడు. అతను ఎవరో కాదు వెన్నెల కిషోర్(Vennela Kishore).
టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వెన్నెల కిషోర్. మొదటి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్నాడు అని అనుకుంటారు కానీ, వెన్నెల అనేది తనకు సినిమా ద్వారా రాలేదని కిషోర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఒక ప్రొడక్షన్ మేనేజర్ కిషోర్ అనే నేమ్ కామన్ గా ఉండడంతో కారు పంపడానికి ఆయన పేరు ముందు వెన్నెల యాడ్ చేయడంతో అప్పటి నుంచి అతనిని వెన్నెల కిషోర్ అని పిలవడం మొదలుపెట్టారని చెప్పుకొచ్చాడు. అయితే వెన్నెల సినిమాలో అవకాశం కూడా కిషోర్ కు కావాలని రాలేదు. దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉందట.
వెన్నెల సినిమాకు దర్శకత్వం వహించిన దేవా కట్టా మయసభ ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. కిషోర్ అసలు నటుడు అవ్వాలనే ఇండస్ట్రీకి రాలేదట. అతడు డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడట. దానికోసమే దేవా కట్టా దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడట. అది కూడా పవన్ కళ్యాణ్ నే డైరెక్ట్ చేయాలనీ పట్టుబట్టి గట్టిగా డైరెక్షన్ నేర్చుకోవాలని తన ఫ్రెండ్ అయిన దేవా కట్టా దగ్గర అన్ని పనులు చేస్తూ ఉన్నాడట.
అయితే దేవా కట్టా అప్పటికే వెన్నెల సినిమాలోని కిషోర్ క్యారెక్టర్ కు మొదట శివారెడ్డిని అనుకున్నారట. అయితే వీసా అందకపోవడంతో శివారెడ్డి అమెరికాకు రాకపోవడం, అప్పటికే బడ్జెట్ ఎక్కువ కావడంతో అక్కడే తెలిసినవారిని డబ్బులు లేకుండా నటించాలని దేవాకట్టా ప్రయత్నించడం జరిగింది. ఆ సమయంలోనే కిషోర్ ను ఖాదర్ పాత్రకు ఒప్పించినట్లు దేవాకట్టా తెలిపాడు. అయితే మొదట కిషోర్ ఖాదర్ పాత్ర చేయనని చెప్పాడని, చాలాసేపు ఒప్పించి, ఇలా చేస్తే సినిమాల్లకి త్వరగా వెళ్లొచ్చని, డైరెక్టర్ గా మారొచ్చని చెప్పి ఒప్పించినట్లు తెలిపాడు. అలా కిషోర్.. వెన్నెల కిషోర్ గా మారాడు. పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయాల్సినవాడు ఇదుగో ఇప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందుతున్నాడు. మరి భవిష్యత్ లోనైనా కిషోర్ కల నెరవేరుతుందో లేదో చూడాలి.