Thaman: తమన్‌కు ఏమైంది.. ఈ రేంజ్‌లో ట్రోలింగ్!
ABN , Publish Date - Nov 26 , 2025 | 07:07 AM
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొంతకాలంగా టాలీవుడ్‌ను ఓ రేంజ్‌లో అలరిస్తూ వస్తున్నారు. పాటలతో కొన్నిసార్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరికొన్ని సార్లు మురిపించారు. అయితే రాబోయే తమన్ సినిమాల సాంగ్స్ తో ట్రోల్స్ కు గురవుతున్నారు. ఎందుకలాగా?
వరుసగా నటసింహ బాలకృష్ణ (Nandamuri Balakrishna) నాలుగు సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు తమన్ (Thaman). దాంతో ఆయనను జనం 'నందమూరి తమన్' అని కూడా అన్నారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్న 'అఖండ-2' మూవీలోని రెండు పాటల్లో టైటిల్ సాంగ్ పరవాలేదని టాక్ సంపాదించింది. కానీ, 'జాజికాయ..' అంటూ సాగే పాట అంతగా అలరించలేక పోతోంది. దాంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ తమన్ కు ఏమైందని అంటున్నారు. సాంగ్స్ తో కాకపోయినా నేపథ్య సంగీతంతో అదరహో అనిపిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. అంతా బాగానే ఉంది కానీ, తమన్ స్వరకల్పనలోనే రూపొందిన రెబల్ స్టార్ 'ద రాజాసాబ్' నుండి వచ్చిన 'రెబల్ సాబ్. రెబల్ సాబ్.' అంటూ మొదలయ్యే పాట 'కాపీ' అని తేల్చేశారు జనం. దాంతో ట్రోల్స్ మరింతగా ఊపందుకున్నాయి.
కాపీ కొట్టేశారా..?
ఏ నాటి నుంచో తమన్ స్వరకల్పనలో కాపీ ట్యూన్స్ ఉన్నాయని జనం అంటూనే ఉన్నారు. అయితే ఎప్పటి కప్పుడు బంపర్ హిట్స్ తో ముందుకు సాగుతూ వాటిని మరిపించేస్తున్నాడు. 2020లో 'అల వైకుంఠపురములోతో అదరహో అనే రేంజ్ లో బాణీలు కట్టాడు తమన్. ఆ సినిమాతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు కూడా సంపాదించారు.
ఇక 2021లో 'అఖండ', 'క్రాక్' సినిమాలతో, 2022లో "భీమ్లా నాయక్, సర్కారువారి పాట", 2023లో "వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి", 2024లో 'గుంటూరు కారం', 2025లో 'గేమ్ చేంజర్, డాకూ మహారాజ్" చిత్రాల సంగీతంతో భలేగా ఆకట్టుకున్నాడు. దాంతో ఆయనపై పడ్డ 'కాపీ క్యాట్'అనే ముద్రను ఎవరూ పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ మూవీకి సమకూర్చిన సంగీతాన్ని జనం ఇట్టే గుర్తు పట్టేశారు. ద రాజాసాబ్ (The Raja Saab) నుంచి వచ్చిన "రెబల్ సాబ్.. రెబల్ సాబ్" అంటూ సాగే పాటకు 'హనుమాన్ కైండ్ - కల్మి' రూపొందించిన 'రన్ ఇట్ అప్..' సాంగ్ ట్యూన్స్ లాగే ఉన్నాయని ట్రోల్స్ సాగుతున్నాయి.
తమన్ ఏం చేస్తాడో..!
ప్రస్తుతం ట్రెండింగ్ లో రామ్ చరణ్ పెద్ది (Peddi) సినిమాలోని "చికిరి" సాంగ్ ఏ.ఆర్.రహమాన్ బాణీల్లో 100 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. మరోవైపు 'మన శంకరవరప్రసాద్ గారు'లోని భీమ్స్ కంపోజ్ చేసిన "మీసాల పిల్లా.." సాంగ్ సైతం 50 మిలియన్ వ్యూస్ మార్కు దాటేసి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య 'అఖండ-2'కు, ప్రభాస్ 'ద రాజాసాబ్‌కు తమన్ అందించిన ట్యూన్స్ అంతగా ఆకట్టుకోక పోవడంతో సదరు స్టార్స్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు.
అంతేకాదు.. తమన్ కాపీ చేసి దొరికి పోయాడంటూ నెటిజెన్స్ ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5వ తేదీన వస్తోన్న 'అఖండ-2' నేపథ్య సంగీతమైనా ఆకట్టుకొనేలా ఉండాలి. అలాగే జనవరి 9న జనం ముందుకు రానున్న 'ద రాజాసాబ్'లోనూ మిగిలిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరహో అనిపించాలి. మరి తమన్ ఏం చేస్తాడో చూడాలి.