జవానే హీరో.. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సాంగ్
ABN , Publish Date - May 29 , 2025 | 05:23 PM
ఇటీవల మన దేశ పౌరులపై జరిగిన దాడికి ప్రతిగా మన దేశ జవాన్లు పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై చేసిన ఆపరేషన్ సింధూర్ ఆదర్శంగా ఓ పాట విడుదలైంది.
ఇటీవల మన దేశ పౌరులపై జరిగిన దాడికి ప్రతిగా మన దేశ జవాన్లు పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై చేసిన ఆపరేషన్ సింధూర్‌ను ఆదర్శంగా తీసుకుంటూ ప్రముఖ ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి పాట రూపంలో తన దేశభక్తిని చూపారు. ప్రసాద్ రచించిన ఈ పాటకు రమేష్ సంగీతం అందించగా కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఉమా శంకర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు మనికంట ఎడిటింగ్ చేయగా సత్య శ్రీనివాస్ సంగీత సహకారం అందించారు. లక్ష్మణ్ పూడి స్వయంగా ఈ పాట పాడడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జేడీ లక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మిత్రుడు లక్ష్మణ్ ఆపరేషన్ సింధూర్ పై మన దేశ జవానుల గురించి పాట పాడటం, ఆ పాట లాంచ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషకరం. దేశంలోని జవాన్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ఒక పాట రూపంలో మనకు చూపించారు. ఆయన ఎంతకాలం ఆరోగ్యం గురించి డైట్ చెప్తారు అనుకున్నాను కానీ ఆయన తండ్రి కమ్యూనిస్టు పార్టీలో ఉండటంవల్ల ఆయన భావజాలాలు, దేశం కోసం ఏమైనా చేయాలి అనే తపన లక్ష్మణ్ లో ఈ పాట ద్వారా కనిపించాయిన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. మంచి కంటే చెడు వేగంగా ప్రజల్లోకి వెళుతుంది. అలాంటిది లక్ష్మణ్ గారు అందరికీ ఉపయోగపడేలా ఆరోగ్యాన్ని పంచుతున్నారు. దేశంపై భక్తితో ఆయన చేసిన పాటను లాంచ్ చేయడం కోసం రావడం జరిగింది. ఈరోజు స్టేజీపై ఉన్న రియల్ హీరోలను కలవడం మరింత సంతోషాన్ని కలగజేస్తుంది. లక్ష్మణ్ గారిలో ఒక మంచి గాయకుడు, నటుడు ఉన్నాడు. ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందన్నారు.
ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ.. దేశం కోసం చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలని నాకు ఉండేది. అయితే ఆరోగ్య డైట్ కంటే ముందే నాలో ఒక విప్లవ కళాకారుడు, ఒక గాయకుడు, ఒక రచయిత ఉన్నాడు. మిలటరీ మాధవపురం అనే ఊరుకు ప్రతి సంవత్సరం వెళ్లి పాటలు పాడేవాళ్ళం. వాళ్లే మాకు ఇన్స్పిరేషన్. దేశం కోసం ఏమైనా చేయాలని అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ పాటను చేశాను. ఈ పాటను మురళి నాయక్ కుటుంబానికి అంకితం చేస్తున్నాను. సరిహద్దులో జవాన్లు మన దేశం కోసం కాపలా కాస్తున్నట్లు దేశంలోపల నుంచి నేను అందరి ఆరోగ్యం కోసం డైట్ చేపిస్తూ కాపలా కాస్తున్నాను. ఆహారం మాది, ఆరోగ్యం మీది, ఆరోగ్య డైట్ అంటూ ముగించారు.