War 2 Vs Coolie: వార్ 2 వర్సెస్ కూలీ.. గెలుపెవరిదంటే?
ABN , Publish Date - Aug 15 , 2025 | 07:03 AM
కొంత కాలంగా అందరినీ ఊరిస్తూ వచ్చిన 'వార్ 2స, 'కూలీస సినిమాలు గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చేశాయి..
గత కొంత కాలంగా అందరినీ ఊరిస్తూ వచ్చిన 'వార్ 2స (War 2), 'కూలీస (Coolie) సినిమాలు గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చేశాయి.. వరుసగా సెలవులు రావడం ఈ రెండు చిత్రాలకు పెద్ద ప్లస్ పాయింట్.. మరి ఈ మూవీస్ గట్టెక్కాలంటే ఏ మేరకు వసూళ్ళు రాబట్టాలి? ఈ రెండింటిలో గెలుపెవరిదో చూద్దాం.
ఆగస్టు పద్నాలుగో తేదీ గురువారం రెండు డబ్బింగ్ మూవీస్ 'వార్ 2', 'కూలీ' జనం ముందు నిలిచాయి. రెండూ పాన్ ఇండియా మూవీస్ గా వచ్చాయి.. ఆల్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా విడుదలయ్యాయి. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) సంస్థ నిర్మించిన స్పై మూవీ 'వార్'కు సీక్వెల్ గా రూపొందింది 'వార్ 2'. ఇది ఒరిజినల్ హిందీ కాగా, లోకేశ్ కనగరాజ్ దర్శకునిగా రజనీకాంత్ (Rajinikanth) హీరోగా కళానిధి మారన్ తెరకెక్కించిన 'కూలీ' తమిళ సినిమా. ఈ రెండు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లోనూ విడుదలయ్యాయి. 'వార్ 2'లో తెలుగు స్టార్ హీరో యన్టీఆర్ (Jr NTR), 'కూలీ'లో తెలుగు సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) నటించడం వల్ల రెండు సినిమాలకు తెలుగు నాట మంచి క్రేజ్ లభించిన మాట వాస్తవం. అయితే తెలుగు నేలపై ఎక్కువ థియేటర్స్ 'వార్ 2'కే లభించడం విశేషం! అలాగే 'వార్ 2' మూవీ హిందీ చిత్రం కాబట్టి ఉత్తరాదితో కలిపి ఆల్ ఇండియాలో 'వార్ 2'కు అత్యధిక స్క్రీన్స్ దక్కాయి. రజనీకాంత్ క్రేజ్ తో తమిళనాడులో 'కూలీ'కి ఎక్కువ థియేటర్స్ లభించాయి. అమెరికాలో మాత్రం 'వార్ 2' కంటే 'కూలీ' అత్యధిక ప్రీమియర్ షోస్ ప్రదర్శితం కావడం గమనార్హం! ఇక యూకేలో 'వార్ 2'దే పైచేయని వినిపిస్తోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థాధినేత ఆదిత్య చోప్రా జాతీయ దినోత్సవాలనే ఎంచుకుంటారని పిస్తోంది. ఆగస్టు 14న తమ 'వార్ 2'ను రిలీజ్ చేయాలని ఆయన భావించారు. మరుసటి రోజునే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం - ఆ రోజు నేషనల్ హాలీ డే.. ఆగస్టు 16న కృష్ణాష్టమి - పలు రాష్ట్రాలలో సెలవు... ఆ పై ఆదివారం... ఇలా వరుసగా నాలుగు రోజులు కలసి వస్తుందని ఆదిత్య చోప్రా ఆశించారు. 'కూలీ' మేకర్స్ కూడా అదే తలంపుతో ఆగస్టు 14వ తేదీని ఎంచుకున్నారు. గతంలోనూ యశ్ రాజ్ సంస్థ తమ 'వార్' చిత్రాన్ని 2019లో అక్టోబర్ 2న గాంధీ జయంతికి రిలీజ్ చేశారు... అదే రోజున మరో పాన్ ఇండియా మూవీగా తెలుగు చిత్రం 'సైరా...నరసింహారెడ్డి' రిలీజ్ అయింది.. ఇప్పటి 'కూలీ'లో లాగా అందులోనూ పలు భాషలకు చెందిన స్టార్స్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ నటించారు. అయినా 'వార్' సత్తా చాటుకుంది. అదే నమ్మకంతో కాబోలు ఇప్పుడు కూడా పలువురు స్టార్స్ నటించిన 'కూలీ' వస్తోన్నా తమ 'వార్ 2'ను రిలీజ్ చేశారు ఆదిత్య చోప్రా. 400 కోట్లతో 'వార్ 2' నిర్మితమయింది. ఇక 'కూలీ' కూడా దాదాపు 350 కోట్లతో తెరకెక్కిందని చెబుతున్నారు. 'వార్ 2'ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలుగునాట విడుదల చేయగా, ఏసియన్ ఫిలిమ్స్ 'కూలీ'ని ఇక్కడ రిలీజ్ చేసింది.
నార్త్ ఇండియాలోనూ, యూకేలోనూ 'వార్ 2' హవా, అమెరికాలో, తమిళనాట 'కూలీ' సత్తా కనిపిస్తున్నా, తెలుగునేలపైనే అందరి చూపు సాగుతోంది. ఎందుకంటే రెండు మల్టీస్టారర్ మూవీస్ ఒకే రోజున రావడంతో తెలుగునేలపై సినీఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. యన్టీఆర్ కారణంగా 'వార్ 2' తెలుగునాట మంచి రేటు పలికింది. ఇక రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబో కావడం, సీనియర్ హీరో నాగార్జున విలన్ గా నటించడం 'కూలీ'కి తెలుగునేలపై ప్లస్ పాయింట్స్... తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2' బిజినెస్ 90 కోట్లు - కాగా 'కూలీ' బిజినెస్ 45 కోట్లయింది. ఇక 'వార్ 2' వరల్డ్ వైడ్ బిజినెస్ 340 కోట్లు - ప్రపంచవ్యాప్తంగా 'కూలీ' బిజినెస్ 305 కోట్లు... 700 కోట్లు గ్రాస్ వసూళ్ళు వస్తే 'వార్ 2'కు బ్రేక్ ఈవెన్ లభిస్తుందని ట్రేడ్ పండిట్స్ మాట. అలాగే 'కూలీ' బ్రేక్ ఈవెన్ చూడాలంటే దాదాపు 600 కోట్లు పోగేయాలి... రెండు సినిమాలకు ఓపెనింగ్స్ బాగా లభించాయి. టాక్ వైజ్ గా చూస్తే రెండింటికి బ్యాడ్ టాక్ ఉంది. కొన్ని చోట్ల ‘కూలీ’, మరి కొన్ని చోట్ల ‘వార్ 2’ పై చేయి అనిపించుకుంటున్నాయి. ఏ సినిమాకు యునానిమస్ గా గుడ్ టాక్ రాకపోవడం గమనించాల్సిన అంశం. మరి వరుసగా నాలుగు రోజుల సెలవులు రావటం ఏ సినిమాకు కలసి వస్తుందో చూడాలి...