Mass Ka Das: ఏప్రిల్ 3న రాబోతున్న 'ఫంకీ'

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:02 PM

విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న 'ఫంకీ' మూవీ వచ్చే యేడాది ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. ఈ సినిమాను కె.వి. అనుదీప్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Funky Movie

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen). హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ (K.V. Anudeep). వీరిద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఫంకీ' (Funky). ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న 'ఫంకీ' చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ ఇచ్చిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినోదభరిత చిత్రాలలో ఒకటిగా 'ఫంకీ' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.


'ఫంకీ' సినిమా కోసం స్వచ్ఛమైన వినోదాన్ని అందిస్తూ, ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తే అద్భుతమైన బృందం ఒకచోట చేరింది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి రాబోతున్నాడు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. అనుదీప్ దర్శకత్వం అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 'జాతిరత్నాలు' సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన.. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్నారని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య చెబుతున్నారు.


'ఫంకీ' చిత్రంలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నాడు మాస్ కా దాస్. ఇప్పటికే టీజర్‌లో ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమాలో కయాదు లోహర్‌ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో, 'ఫంకీ'పై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'ఫంకీ' చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

Also Read: The Fantastic Four OTT: రూ.4380 కోట్ల హాలీవుడ్ సినిమా.. ఫ్రీగా ఓటీటీకి వ‌చ్చేసింది!

Also Read: Vrusshabha: మోహన్ లాల్ సినిమాకూ తప్పలేదు...

Updated Date - Nov 06 , 2025 | 05:09 PM