Dark ChocolateTeaser: ఛీఛీ.. రానా.. సక్సెస్ కోసం ఇంత దిగజారాలా
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:55 PM
జనరేషన్ మారిపోయింది. ఒకప్పుడు బూతులు ఉంటే సినిమాను ప్రేక్షకులు పక్కకి నెట్టేసేవారు.
Dark ChocolateTeaser: జనరేషన్ మారిపోయింది. ఒకప్పుడు బూతులు ఉంటే సినిమాను ప్రేక్షకులు పక్కకి నెట్టేసేవారు. కానీ, ఇప్పుడు బూతులు ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్లే మేకర్స్.. తమ సినిమాలో బూతులను బీభత్సంగా వాడుతున్నారు. అసలు కొన్ని సినిమాలు అయితే బూతుల్లోనే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. నెట్ ఫ్లిక్స్ లో అడల్ట్ సినిమాల్లో ఇంత పచ్చి బూతులు ఉండేవి. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఒక సినిమాలో మరీ దారుణంగా బూతులు ఉండడం నెట్టింట వైరల్ గా మారింది.
విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి జంటగా శశాంక్ శ్రీవాత్సవ్య దర్శకత్వం వహించిన చిత్రం డార్క్ చాక్లెట్. సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తున్నాడు. ఈ చిత్రంలో రాకేష్ రాచకొండ, రమేష్ కోనంభొట్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ మొత్తాన్ని బూతులతో నింపేశారు. అసలు నోటితో అనరాని మాటలను హీరోతో అనిపించారు. ఇంత దారుణమైన టీజర్ ను తెలుగులో ఎవరూ కట్ చేయలేదు అని చెప్పొచ్చు. బీప్ కూడా వేయకుండా స్పష్టంగా బూతులను పలికించారు.
వినడానికే జుగుప్సగా ఉండే పదాలను హీరో పలుకుతున్నాడు కానీ, అతనిని ఆ క్యారెక్టర్ లో ఊహించుకోలేరు. ఎందుకంటే.. ఆ హీరోనే 35 సినిమాలో సాంప్రదాయంగా కనిపించి మంచి విజయం అందుకోవడంతో పాటు అవార్డును కూడా అందుకున్నాడు. అలాంటి హీరో.. ఇప్పుడు ఇలా పచ్చి బూతులు మాట్లాడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు నెటిజన్స్. టీజర్ చూసాక అందరూ రానాపై విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్న చిన్న సంస్థలు ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి అంటే.. సక్సెస్ కోసం ఏదో చేస్తున్నాయి అనుకోవచ్చు.. కానీ, రానా లాంటి స్టార్ హీరో, స్టార్ ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి కంటెంట్ ను ఎంకరేజ్ చేయడం ఏంటి.. సక్సెస్ కోసం ఆయన కూడా ఇంత దిగజారాలా అని పలువురు విమర్శిస్తున్నారు.
రానా.. ఇదేమైనా తన రానా నాయుడు సిరీస్ అనుకుంటున్నాడా.. ? అందులో కూడా ఇన్ని బూతులు లేవు. మళ్లీ ఇదొక ఫిల్మ్ నగర్ యూనివర్స్ అని అందులో కూడా బూతు యాడ్ చేశాడు. ఇలా ఈ టీజర్ మొత్తం బూతులతో నింపేశాడు. టీజర్ చూసినవారందరూ ఇది థియేటర్ లో వచ్చే సినిమా కాదు.. ఓటీటీకి వస్తుంది. అందుకే ఇంత ధైర్యంగా బూతులను పెట్టారు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి టీజర్ లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉంటుందా అనేది చూడాలి.