Vijay Deverakonda: రౌడీ హీరోకు ‘ఆదివాసీలు’ షాక్

ABN , Publish Date - May 02 , 2025 | 02:01 PM

ఒక్క టంగ్ స్లిప్‌.. సెల‌బ్రెటీల‌కు ట‌న్నుల కొద్ది సమస్యలను తెచ్చిపెడుతోంది. అనుకోకుండా చేసే కామెంట్లు... అనుకోని సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. మామూలే క‌దా అని ఏది ప‌డితే అది మాట్లాడితే చివ‌రికి పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోంది. తాజాగా ఓ యంగ్ హీరో ఇలాంటి ప్రాబ్లమ్స్ లోనే చిక్కుకున్నాడు.

తెలిసీ తెలియక సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు ఇటీవ‌ల‌ వివాదాలకు దారితీస్తున్నాయి. ఒక విషయాన్ని వివరించే క్రమంలో తప్పుడు ఉదాహరణలు తీసుకోవడం వల్ల కొందరు స్టార్స్ చిక్కుల్లో పడుతున్నారు. మంచి ఉద్దేశంతో మాట్లాడినా, ఆ మాటలు ఎదుటివారి మనోభావాలను గాయపరచడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో లాగా ఏది పడితే అది మాట్లాడితే ఇప్పుడు కుదరడం లేదు. ఇలాంటి పరిస్థితిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన వ్యాఖ్యలతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.


ఇటీవల 'రెట్రో' (Retro) సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ‘ఆదివాసీలు’ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదం ఆయనకు తీవ్రమైన ఇబ్బందులను తెచ్చిపెట్టింది. పహల్గమ్ (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... 'ఆదివాసీల్లాగా దాడి చేశారు' అని విజయ్ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ సమాజాన్ని మ‌న‌సు నొచ్చుకునేలా చేశాయి. ఆదివాసీల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కిషన్ లాల్ చౌహన్ అనే న్యాయ‌వాది.. విజయ్ ఆదివాసీలను అవమానించారని ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు న్యాయ సలహా కోసం వేచి చూస్తుండటంతో ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. అంత‌కుముందు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా ఆదివాసీ జేఏసీ... విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం.. సినీ అభిమానులు, సెలబ్రిటీలు ఇకపై వేదికలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, ఆలోచించి మాట్లాడాలనేది తెలియచెబుతోంది.

Updated Date - May 02 , 2025 | 02:01 PM