Vijay Deverakonda Interview: రెండో భాగం మరింత అలరిస్తుంది
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:32 AM
‘తన అన్న శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని ‘కింగ్‌డమ్’ తొలి భాగంలో చూశాం. రెండో భాగం కోసం దర్శకుడు గౌతమ్ దగ్గర గొప్ప ఆలోచనలున్నాయి. అది మరింత అద్భుతంగా...
‘తన అన్న శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని ‘కింగ్‌డమ్’ తొలి భాగంలో చూశాం. రెండో భాగం కోసం దర్శకుడు గౌతమ్ దగ్గర గొప్ప ఆలోచనలున్నాయి. అది మరింత అద్భుతంగా ఉండబోతోంది’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రమిది. ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు.
సినిమా విడుదలకు ముందు ప్రతి ఒక్క హీరో పైనా ఒత్తిడి ఉంటుంది. ‘కింగ్‌డమ్’ విడుదలకు ముందు నాపైనా అలాంటి ఒత్తిడి ఉంది. మొదటి షో పూర్తయి హిట్ టాక్ రాగానే చాలా సంతోషం కలిగింది. ఈ చిత్రానికి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి ఆదరణ దక్కుతున్నందుకు ఆనందంగా ఉంది.
అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే లైన్ గౌతమ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. సినిమాలో బలమైన భావోద్వేగాలు ఉండేలా ఆయన కథను తీర్చిదిద్దారు.
‘పెళ్లిచూపులు’ చిత్రం హిట్టయినప్పుడు మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక సినిమా హిట్టయితే, ఆనందం కన్నా మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువ ఉంది.
ఈ సినిమాలో మరింత ధృడంగా కనిపించేందుకు కసరత్తులు చేశాను. నాటి కాలానికి తగ్గట్లు ఆహార్యం, అభినయంలో వైవిధ్యం చూపేందుకు ప్రయత్నించాను. రాహుల్ సాంకృత్యాన్, రవికిరణ్ కోలా దర్శకత్వంలో నా తదుపరి సినిమాలు చేస్తున్నాను.