Cartoonist Filmmaker Shanku Passes Away: సీనియర్ కార్టూనిస్టు దర్శకుడు శంకు కన్నుమూత
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:55 AM
సీనియర్ వ్యంగ్య చిత్రకారుడు, రచయిత, దర్శక, నిర్మాత సంపర భీమ శంకర కుమార్ అలియాస్ శంకు(78) ఇకలేరు. ఆయన ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గుండెపోటుతో బాగ్ అంబర్ పేటలోని స్వగృహంలో...
సీనియర్ వ్యంగ్య చిత్రకారుడు, రచయిత, దర్శక, నిర్మాత సంపర భీమ శంకర కుమార్ అలియాస్ శంకు(78) ఇకలేరు. ఆయన ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గుండెపోటుతో బాగ్ అంబర్ పేటలోని స్వగృహంలో హఠాన్మరణం చెందారు. శంకు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తణుకు. బాపూ బొమ్మల స్ఫూర్తితో 1962లో తన 16వ ఏట కుంచె పట్టిన శంకు ఆంధ్ర పత్రికకు రెండు దశాబ్దాలు బొమ్మలు, కార్టూన్లు గీశారు. ఉన్నత విద్య అనంతరం ప్రఖ్యాత దర్శకుడు బాపు దగ్గర తొమ్మిది సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో కొంతకాలం పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినా, ఉద్యోగ నిబంధనల కారణంగా టైటిల్స్ లో మాత్రం సహ నిర్మాతగా వేయించినట్లు తానే ఓ సందర్భంలో చెప్పారు. మునిమాణిక్యం ‘కాంతం కథలు’, శంకరమంచి ‘అమరావతి కథలు’ , వంశీ ‘మా పసలపూడి కథలు’, సయ్యద్ సలీం కథలను టెలివిజన్ ధారావాహికలుగా రూపొందించారు. అందుకుగాను నాలుగు నంది పురస్కారాలు అందుకున్నారు. తెలుగు కార్టూనిస్టులందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడంలో శంకు ప్రముఖ పాత్ర పోషించారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన 13 మంది కార్టూనిస్టుల జీవితంపై ‘ఎమినెంట్ కార్టూనిస్ట్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో దూరదర్శన్‌కు డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు. క్రోక్విల్ హాస్య ప్రియ పేరుతో ఓ మాస పత్రికను కూడా నిర్వహించారు. క్రోక్విల్ అకాడమీ ద్వారా వ్యంగ్య చిత్రకారులను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణం ఇతివృత్తంగా శంకు గీసిన కార్టూన్‌కు బెల్జీయంలోని నాఖీస్ట్ అంతర్జాతీయ పురస్కారం లభించింది. సాహిత్య, కళా రంగాలలో శంకు అందించిన సేవలకుగాను 2015లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారంతో సత్కరించింది. శంకు భార్య పేరు ఎల్లాప్రగడ శోభారాణి. ఆమె దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా, సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె సత్య, కుమారుడు చైతన్య. శంకు భౌతికకాయానికి సినీ ప్రముఖులు వంశీ, బ్రహ్మానందం, రచయితలు బ్నిం, సుధామ, కార్టూనిస్టు సరసి తదితరులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆదివారం సాయంత్రం అంబర్ పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి)