South Indian actress: అభినయ సరస్వతి బి. సరోజాదేవి ఇక లేరు
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:58 AM
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించి ‘అభినయ సరస్వతి’ గా పేరొందిన బి. సరోజాదేవి(87) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె...
నేడు దశవారలో అంత్యక్రియలు
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించి ‘అభినయ సరస్వతి’ గా పేరొందిన బి. సరోజాదేవి(87) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఒకప్పటి మైసూరు సంస్థానం చన్నపట్టణ పరిధిలోని దశవార గ్రామంలో 1938 జనవరి 7న ఒక్కలిగ కుటుంబంలో సరోజాదేవి జన్మించారు. తండ్రి బైరప్ప మైసూరులో పోలీసు అధికారి కాగా తల్లి రుద్రమ్మ గృహిణి. దంపతులకు నాల్గో సంతానంగా సరోజాదేవి జన్మించారు. 13వ ఏట కన్నడ సినిమాలో అడుగు పెట్టారు. ‘మహాకవి కాళిదాస’ 1955లో నటించడం ద్వారా ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ఓవైపు కన్నడ సినిమాలలో నటిస్తూనే తెలుగు, తమిళ భాషల్లోనూ కొనసాగారు. కన్నడలో డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్‌కుమార్, ఉదయ్‌కుమార్, తెలుగులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో జెమినీ గణేశన్, శివాజి గణేశన్, ఎంజీ రామచంద్రన్‌తోపాటు హిందీలో దిలీ్‌పకుమార్, రాజేంద్రకుమార్, షమ్మికపూర్, సునిల్‌దత్‌లతో కలసి నటించారు. సరోజాదేవి 1967 మార్చి 1న జర్మనీలో మెకానికల్ ఇంజనీర్ అయిన శ్రీహర్షను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే దాదాపు వంద చిత్రాల్లో నటించిన సరోజాదేవి. భర్త శ్రీహర్ష ప్రోత్సాహంతో నటిగా కొనసాగారు. 1986లో శ్రీహర్ష గుండెపోటుతో కన్నుమూశారు.. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కాగా పెద్దకుమార్తె మృతి చెందారు.
బి.సరోజాదేవి మృతికి ఆంధ్ర, కర్ణాటక ముఖ్యమంత్రుల సంతాపం బి.సరోజాదేవి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ప్రతిపక్షనేత ఆర్ అశోక్, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, సభాపతి హొరట్టి, ప్రముఖ నటులు రజనీకాంత్, కిచ్చా సుదీప్, ఖుష్బూ సుందర్, సిమ్రాన్ సహా పలువురు సంతాపం తెలిపారు.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి)
ఆ ప్రత్యేకత ఆమె సొంతం
సరోజాదేవి మృతిపై నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ‘దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకప్పుడు ధ్రువతారగా వెలుగొందిన బి.సరోజాదేవి ఇక లేరు అన్న వార్త ఎంతో బాధాకరం. మా తండ్రి ఎన్టీఆర్‌తో దాదాపు 20 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆయనతో శ్రీరాముడి పక్కన సీతాదేవిగా, రావణాసురుడి పక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు
ఎన్టీఆర్ అవార్డు స్వీకరిస్తూ...