Venu Udugula: అనంత శ్రీ రామ్ దేనిని అణగదొక్కాలని చూస్తున్నావ్..

ABN , Publish Date - Jan 06 , 2025 | 08:53 PM

Venu Udugula: ఆదివారం.. ఆంధ్రప్రదేశ్, కృష్ణ జిల్లాలో జరిగిన హైందవ శంఖారావంలో సినీ గేయ రచయిత చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన తెలుగు సినిమాల్లో కర్ణుడి పాత్రను గొప్పగా చూపించడంపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ 'దాన వీర శూర కర్ణ' నుండి నాగ్ అశ్విన్ 'కల్కి' సినిమా వరకు ఆయన తీవ్ర అభ్యంతరాలు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కవి, సినీ దర్శకులు వేణు ఉడుగుల.. అనంత శ్రీరామ్ స్టాండ్ పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది.

director venu udugula slams anantha sreeram

ఆదివారం అనంత శ్రీ రామ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కవి, సినీ దర్శక నిర్మాత వేణు ఉడుగుల.. అనంత శ్రీరామ్ స్టాండ్ పై అనుమానం వ్యక్తపరిచారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. " అనంత శ్రీరామ్ సార్..'కల్కి' సినిమా సంగతి పక్కన పెడితే, తెలుగు సాంస్కృతిక కథనంలో, కర్ణుడి పాత్రకు సామాజిక, మానవతా దృక్పథాన్ని పరిచయం చేసిన మొదటి సినిమా “దాన వీర శూర కర్ణ”. మహానటుడు ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా కర్ణుడి వ్యక్తిత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేశారు. మీ వ్యాఖ్యలు కేవలం కర్ణుడి పాత్రను ఉద్దేశించి చేశారా లేదా ఎన్టీఆర్ అందించిన సామాజిక ప్రతిధ్వని దృష్టిని కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా? మీ వ్యాఖ్యలు ఆయన సృజనాత్మక వారసత్వాన్ని తిరస్కరించినట్లుగా చూడవచ్చా?" అంటూ ప్రశ్నించారు.


మరో ట్వీట్ చేస్తూ.. "అనంత శ్రీ రామ్.. ప్రతి పాత్ర సాహిత్యం లేదా సినిమాలలో మంచి, చెడు యొక్క ద్వంద్వ కోణాలను కలిగి ఉంటుంది. కర్ణుడి విషయంలో మీరు ఈ ద్వంద్వత్వాన్ని పూర్తిగా విస్మరించారనిపిస్తోంది. కుల వివక్షను ఎదుర్కొని యోధునిగా ఎదిగిన వ్యక్తి కథనాన్ని కొట్టిపారేయడం ద్వారా, మీ వ్యాఖ్యలు ఏకపక్ష దృక్పథాన్ని ప్రతిబింబించలేదా?" అంటూ అగ్రహావేదన వ్యక్తం చేశారు.


అనంత శ్రీరామ్ ఏమన్నారు అంటే..

"హిందూ సమాజానికి .. ముందు తాను సినీ రంగం తరపున క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. క్షమాపణ చెప్పకపోతే తనకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదని అన్నారు. మన పురాణాలు, ఇతి హాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి పలు పాత్రలు మార్చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నిన్న, మొన్న వచ్చిన కల్కి చిత్రం వరకు కూడా కొన్ని పాత్రలను అవమానిస్తూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి తాను సినిమా వాడిగా సిగ్గు పడుతున్నానని అన్నారు. ఈ కృష్ణా జిల్లాకే చెందిన దర్శకలు, నిర్మాతలే ఈ పొరబాటు‌ చెప్పక‌పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలా పాత్రలు ఔన్నత్యాన్ని మారిస్తే... హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదని అనంత శ్రీరామ్ స్పష్టం చేశారు."

‘‘నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు. కల్కి సినిమాలో అగ్నిదేవుడు ద్వారా వచ్చిన అర్జునుడు కంటే.. సూర్యుడు ద్వారా వచ్చిన కర్ణుడు గొప్ప అంటే హిందూ ధర్మం ఒప్పుకుంటుందా..?? భారతంలోనే కాదు రామాయణం, భాగవతంలోనూ ఇష్టానుసారంగా పురాణాలను మార్చివేశారు. అభూత కల్పనలు వక్రీకరణలు చేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నాం. చిత్రీకరణలో, గీతాలపనలో ఎన్నో రకాల అవమానాలు జరిగాయి . దమ్మారో దమ్ అంటూ హరే రామ హరే కృష్ణ అంటారా..?? ఇస్కాన్ వారి నినాదాన్ని సిగరేట్ తాగుతూ అవమానిస్తారా..?? ఇటువంటి వాటిని చూస్తూ ఊరుకుందామా, సహిద్దామా, భరిద్దామా..?? రాముడు, కృష్ణుడు గొప్పతనం‌ చెబుతూ సిరివెన్నెల రాసిన‌ పాటలను ఆదర్శంగా తీసుకోండి. దైవ మూర్తులు, స్వామీజీలను అనుకరించి వారిని అవమానపరిచేలా అవహేళన చేసేలా పాత్రలు చిత్రీకరిస్తున్నారు. ఒక దర్శకుడు బ్రహ్మాండ నాయకుడి అనే పదం ఉండకూడదని చెబితే నేను 15 ఏళ్లుగా ఆ వ్యక్తి కి పాటలు రాయలేదు. తిరపతి ఆలయాన్ని విమర్శిస్తూ ఉంటే నిర్మాతలు మిన్నుకుండి పోతున్నారు. మార్కెట్ ఉందని కారణంతో హిందూ ధర్మాన్ని అవమానించినా ప్రోత్సహిస్తున్నారు. లేదా మన హిందువులే పూర్తిగా బహిష్కరించాలి. అప్పుడే మన ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయి’’ అని అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Updated Date - Jan 06 , 2025 | 10:58 PM