Venu Swamy: సమంత- రాజ్ పెళ్లి.. బాంబ్ పేల్చిన వేణుస్వామి
ABN , Publish Date - Dec 02 , 2025 | 07:01 PM
ఏ ముహూర్తాన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy).. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) - సమంత (Samantha) విడిపోతారని చెప్పాడో కానీ, అప్పటి నుంచి ఆయన రాతే మారిపోయింది.
Venu Swamy: ఏ ముహూర్తాన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy).. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) - సమంత (Samantha) విడిపోతారని చెప్పాడో కానీ, అప్పటి నుంచి ఆయన రాతే మారిపోయింది. పెళ్లి తరువాత ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడతాడు ఏంటి అంటూ చాలామంది ఆయనను ఏకిపారేశారు. ఇంకొంతమంది ఆ అవన్నీ నమ్మితే అంతే సంగతులు అని చెప్పుకొచ్చారు. కానీ, నాలుగేళ్ళ తరువాత వేణుస్వామి ఏది అయితే చెప్పాడో .. అదే జరగడంతో ఓర్నీ ఈయనకు మహిమలు ఉన్నాయి అనుకున్నారు.
ఇక ఆ తరువాత జగన్ విషయంలో వేణుస్వామి తప్పు చెప్పడంతో ఆయనను నమ్మినవాళ్ళే ఇవ్వన్నీ ఫేక్ అంటూ వెళ్లిపోయారు. జనసేన పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు.. వేణుస్వామిపై మండిపడడం, ఆయన క్షమాపణలు కోరడంతో.. అటు రాజకీయాలకు, ఇటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. పూజలు, యూట్యూబ్ లో జాతకాలు చెప్పుకుంటూ బతికేస్తున్నాడు. ఇక ఏడాది క్రితం అక్కినేని నాగ చైతన్య- శోభిత ల వివాహం జరిగినప్పుడు వారి జాతకాల గురించి కూడా చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు సమంత - రాజ్ ల వివాహం జరగడంతో చాలామంది వారి జాతకం చెప్పండి అంటూ చాలామంది కొందరి జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లి అడుగుతున్నారు. ఇక దీనిపై వేణుస్వామి స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఆయన సామ్ వివాహం గురించి చెప్పుకొచ్చాడు. ' అందరూ ఇప్పుడు నన్ను సమంత జాతకం చెప్పమని అడుగుతున్నారు. గతేడాది నాగ చైతన్య - శోభిత వివాహం జరిగినప్పుడు ఎవరిని అడిగి వారి జాతకాలను బహిర్గతం చేశారని నన్ను విమర్శించిన వాళ్ళు.. మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడినట్లు చెప్పినవాళ్లు జ్యోతిష్యులు దగ్గరకు వెళ్లి సమంత - రాజ్ జీవితం ఎలా ఉండబోతుందని అడుగుతున్నారు.
సమంత జాతకం ఎలా ఉండబోతుంది..? మగ పిల్లాడు పుడతాడా.. ? ఆడపిల్ల పుడుతుందా ..? సమంత - రాజ్ కలిసి ఉంటారా.. ? విడిపోతారా.. ? మౌడమి లో పెళ్లి చేసుకుంది.. ఎలా ఉంటుంది ఆమె జీవితం అని అడుగుతున్నారు. ఇప్పుడు సమంత కానీ, రాజ్ కానీ వెళ్లి జాతకం చెప్పమని అడిగారా.. మరి ఇప్పుడెందుకు వాళ్ళు వెళ్లి అడుగుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి.. అని అడుగుతున్నారు. నేను మూడురోజుల నుంచి ఒక పెద్ద సినిమా హిట్ అవ్వాలని మేకర్స్ పూజలు చేయిస్తున్నారు. అక్కడే ఉన్నాను. మిగతా వాటి గురించి నాకు అనవసరం. నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెంకటేశ్వర స్వామి వారు, ఛిన్న మస్తాదేవి అమ్మవారిని నమ్ముకొని నేను ముందుకు కొనసాగుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అదేంటి ఏదో చెప్తాడు అనుకుంటే.. ఈ రేంజ్ లో బాంబ్ పేల్చాడు అంటూ నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.