Adarsha Kutumbam: టైటిల్‌ సెంటిమెంట్‌ను.. వదలని త్రివిక్రమ్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 10:39 PM

విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో 'ఆదర్శ కుటుంబం' చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ షురూ కాగానే అప్పుడే సినీ ఫ్యాన్స్ లో స్పెషల్ డిస్కషన్ స్టార్టయింది.

Adarsha Kutumbam

వెంకటేశ్ (Venkatesh) హీరోగా త్రివిక్రమ్ (Trivikram Srinivas) డైరెక్షన్ లో రూపొందనున్న మొదటి సినిమాకు ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam) అన్న టైటిల్ ను నిర్ణయించారు. అంతే కాదు డిసెంబర్ 10వ తేదీన 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ కూడా మొదలయింది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితుడైన సూర్యదేవర రాధాకృష్ణ తమ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 వేసవిలో విడుదల చేస్తామనీ ముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలో 'ఆదర్శకుటుంబం' పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేశ్ తనదైన హోమ్లీ లుక్ తో కనిపిస్తున్నారు. వెంకీ గెటప్ చూడగానే ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ఇట్టే తెలిసిపోతోంది. 1969లో ఏయన్నార్ కెరీర్ సిల్వర్ జూబ్లీ కానుకగా 'ఆదర్శకుటుంబం' చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఆ టైటిల్ నే వెంకటేశ్ మూవీకి నిర్ణయించడం విశేషంగా మారింది. అయితే ఈ టైటిల్ లో 'హౌస్ నంబర్ 47'- ఏకే 47' అని కూడా చోటు చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.

పాత సినిమా టైటిల్స్ తో వెంకటేశ్ మూవీస్ తెరకెక్కడం కొత్తేమీ కాదు. వెంకటేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మరుసటి సంవత్సరమే 1987లో 'అజేయుడు' అనే ఓల్డ్ టైటిల్ తో వచ్చారు. ఆ తరువాత "ప్రేమ, అగ్గిరాముడు, పవిత్రబంధం, రాజా, మల్లీశ్వరి, ఘర్షణ, లక్ష్మీ, తులసి, ఈనాడు, గురు" వంటి పాత సినిమాల పేర్లతో వెంకటేశ్ నటించిన చిత్రాలు రూపొందాయి. వీటిలో "అజేయుడు, ప్రేమ, అగ్గిరాముడు, ఈనాడు, గురు" చిత్రాలు మినహాయిస్తే మిగిలిన ఆరు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇప్పుడు ఏయన్నార్ నటజీవిత రజతోత్సవ కానుకగా రిలీజైన 'ఆదర్శ కుటుంబం' టైటిల్ నే తన చిత్రానికి పెట్టుకుని వస్తున్నారు వెంకటేశ్. గతంలో ఏయన్నార్ టైటిల్స్ లో రూపొందిన వెంకటేశ్ సినిమాలు "ప్రేమ, పవిత్రబంధం" చిత్రాల్లో 'పవిత్రబంధం' బంపర్ హిట్ గా నిలచింది. అందువల్ల త్రివిక్రమ్ డైరెక్షన్ లో మొదలైన 'ఆదర్శ కుటుంబం' సైతం అందరినీ అలరిస్తుందని వెంకటేశ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇప్పటి దాకా హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాధాకృష్ణ ఏడు సినిమాలు నిర్మించారు. అవి "జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో, గుంటూరు కారం" సినిమాలు. వీటిలో మూడు సినిమాలు మినహాయిస్తే మిగిలిన నాలుగు చిత్రాలు ఇంగ్లిష్ లెటర్ 'ఎ'తో స్టార్ట్ అయ్యే టైటిల్స్ లో రూపొందాయి. వాటిలో 'అజ్ఞాతవాసి' తప్ప మిగిలిన మూడు జనాన్ని భలేగా అలరించాయి. ఆ సెంటిమెంట్ తోనే కాబోలు వెంకటేశ్ తో తాము తీస్తోన్న తాజా చిత్రానికి కూడా 'ఎ' అక్షరంతో వచ్చే 'ఆదర్శ కుటుంబం' టైటిల్ ను పెట్టుకున్నట్టుగా ఉందని సినీ బఫ్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా రచయితగా వెంకటేశ్ నటించిన "నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు" చిత్రాలకు పనిచేసిన త్రివిక్రమ్ తొలిసారి వెంకీని డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను వెంకీ-త్రివిక్రమ్ కాంబో అందుకుంటుందో చూడాలి.

Updated Date - Dec 10 , 2025 | 10:39 PM