Venkaiah Naidu: ఆ పాత్రే తప్ప సావిత్రి ఎక్కడా కనిపించదు
ABN , Publish Date - Dec 06 , 2025 | 09:43 PM
కొంతమంది స్టార్స్ కు మరణం అనేది ఉండదు. వారు మరణించినా.. వారు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, గౌరవం, ప్రేమ చిరకాలం వారిని జీవించేలా చేస్తాయి.
Venkaiah Naidu: కొంతమంది స్టార్స్ కు మరణం అనేది ఉండదు. వారు మరణించినా.. వారు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, గౌరవం, ప్రేమ చిరకాలం వారిని జీవించేలా చేస్తాయి. అలాంటి స్టార్స్ లో మహానటి సావిత్రి (Savitri) కూడా ఒకరు. నటన అనేది ఉన్నంతకాలం ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక నేడు మహానటి సావిత్రి 90 వ జయంతి. ఈ సందర్భంగా ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్ ఛైర్మన్ సంజయ్‌కిషోర్ నిర్వహణలో హైదరాబాద్ లో సావిత్రి మహోత్సవం వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు . సావిత్రి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక ఈ వేడుకకు నటులు, నిర్మాత మురళీమోహన్ (Murali Mohan), తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ వేడుకలో మహానటి సినిమాను నిర్మించిన ప్రియాంక దత్, స్వప్న దత్, రచయిత సంజయ్‌కిషోర్, ప్రచురణ కర్త బొల్లినేని కృష్ణయ్యలను ఘనంగా సత్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ' సావిత్రి మహోత్సవం.. ఎంతో మంచి పేరు పెట్టారు. ఆమెలాంటి నటి ఇంకొకరు ఉండరు. ఆమెను చూసి ఎంతోమంది యువత చాలా నేర్చుకోవాలి. నటిగా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా ప్రజాసేవకు తనవంతు కృషి చేసింది.
ఎన్నో అద్భుతమైన పాత్రలు..కంటితో కూడా కోటి భావాలను పలికించగలదు. నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మెప్పించిన నటి సావిత్రి. ఆమె న ట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించే తప్ప సావిత్రి ఎక్కడా కనిపించేది కాదు. మహానటికి మరణం లేదు. ఈ విషయం చెప్పడానికి నేను ఏ మాత్రం సంకోచించను. ఇప్పటితరం నటీమణులకు సినిమాల్లో ప్రాధాన్యతే లేదు. అసలు కుటుంబం మొత్తం చూసే సినిమాలు కూడా రావడం లేదు. అలా కళాత్మక సినిమాలు చేయాలనీ దర్శకులను కోరుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.