Upasana Konidela: నాకొచ్చిన గుర్తింపునకు ఆ రెండు కారణాలు కాదు..

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:12 PM

కెరీర్‌లో తాను ఎక్కిన ప్రతి మెట్టు, సాధించిన ఘనతకు కారణాలను చెప్పుకొచ్చారు ఉపాసన. ఓ వ్యక్తి ఏ అంశం మీద ప్రత్యేకంగా నిలుస్తారన్న దానిపై ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

Upasana Konidela


రామ్‌చరణ్‌ భార్య ఉపాసన (Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొణిదెల ఇంటి కోడలిగా బాధ్యతల నిర్వర్తిస్తూనే అపోలో గ్రూప్స్‌లను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. అంతే కాదు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారామె. ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌ కో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే కెరీర్‌లో తాను ఎక్కిన ప్రతి మెట్టు, సాధించిన ఘనతకు కారణాలను చెప్పుకొచ్చారు ఉపాసన. ఓ వ్యక్తి ఏ అంశం మీద ప్రత్యేకంగా నిలుస్తారన్న దానిపై ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘ఖాస్‌ ఆద్మీ’ పేరిట తన అభిప్రాయాలను పంచుకున్నారు.


‘నేను ఎంచుకున్న రంగంలో ఎన్నో ఒత్తిళ్లు అధిగమించి ఓ స్థాయికి చేరుకోవడం వల్లే సొసైటీలో గుర్తింపు దక్కింది. ఇది వారసత్వంతోనే, పెళ్లితోనే కాదు. నాపై నాకే ఎన్నోసార్లు సందేహం కలిగేది. అప్పుడప్పుడు నిరుత్సాహపడిన సందర్భాలూ ఉన్నాయి. మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పనులు మొదలుపెట్టే దానిని. ఓ మనిషి సంపద, హోదా, విజయం లాంటివి గొప్పగా చూిపిస్తాయా? స్పందించే గుణం, ఇతరులకు సాయం అందించడం లాంటివి గొప్పవారిని చేస్తాయా అనే వాటికి ఎవరికి వారే సమాధానం వెతుక్కోవాలి. మనల్ని మనం ప్రేమించుకొని, మనకు మనం విలువ ఇచ్చుకున్న క్షణం మనల్ని ప్రత్యేకంగా నిలుపుతుందని నా అభిప్రాయం. వృత్తిపరమైన విజయాలనే సమాజం గుర్తిస్తోంది. మహిళలు పెద్ద కలలు కనేందుకు వారికి ఇచ్చే ప్రోత్సాహం చాలా తక్కువ.  2016 నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ సర్వే ప్రకారం.. 50 శాతం మంది భారతీయులు తాము అనుకున్న స్థాయికి వెళ్లలేకపోతున్నారు. ఈ విషయంలో దాదాపు 16 శాతం మహిళలు డిప్రెషన్‌కు గురవుతున్నారు. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. విజయం దానంతట అదే వస్తుంది. ‘మార్పునకు రావడానికి ఎంతో సమయం పట్టడు. ఒక్క సెకనులో వచ్చే మీ ఆలోచనతోనే అది ఆరంభమవుతుంది. నేను మీతో నిజాయతీగా ఉండాలనుకున్నా. అందుకే ఈ పోస్టు పెట్టా. నా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిప్రాయాలు చెప్పాలనుకున్నానే గానీ ఓ నిపుణురాలిగా కాదు’ అని ఉపాసన పేర్కొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 03:37 PM