Tollywood in Trouble: థియేటర్ల మనుగడ ముఖ్యమా.. పారితోషికం ముఖ్యమా?

ABN, Publish Date - May 13 , 2025 | 03:04 PM

విడుదల అవుతున్న సినిమాలు గోడకు కొట్టిన బంతుల్లా తిరిగి వస్తున్నాయి. దీనికి తోడు ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సింగిల్ థియేటర్లను పర్శంటేజ్ (Percentage System) పద్ధతిలో నడపాలనే వివాదం రాజుకుంది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి టాలీవుడ్ రెండుగా చీలబోతున్నట్లు ఫీలర్స్ అందుతున్నాయి.

విడుదల అవుతున్న సినిమాలు గోడకు కొట్టిన బంతుల్లా తిరిగి వస్తున్నాయి. దీనికి తోడు ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సింగిల్ థియేటర్లను పర్శంటేజ్ (Percentage System) పద్ధతిలో నడపాలనే వివాదం రాజుకుంది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి టాలీవుడ్ రెండుగా చీలబోతున్నట్లు ఫీలర్స్ అందుతున్నాయి. అసలేం జరగుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్ లో పర్సంటేజ్ విధానం అమలులో ఉంది. సింగిల్ థియేటర్స్ మాత్రం రెంటల్ బేస్(Rental System) మీద నడుస్తున్నాయి. అందులో అధిక భాగం థియేటర్లు డి.సురేశ్ బాబు, ఆసియన్ సునీల్, దిల్ రాజు-శిరీష్ చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రెంటల్ సిస్టం వల్ల కలెక్షన్స్ లేక చాలా వరకు సింగిల్ థియేటర్స్ షోస్ ని క్యాన్సిల్ చేయటమో లేక థియేటర్లు మూత వేయటమో చేస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలంటే సినిమాలను పర్సంటేజ్ పద్ధతిలో ఆడాలన్నది సింగిల్ థియేటర్ యజమానుల డిమాండ్!

కొంచెం క్రేజ్ ఉన్న సినిమాలు తొలి రెండు వారాలు రెంట్ బేస్ మీద ఆడి, ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గగానే షేరింగ్ బేస్ మీద ఆడాలని ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల థియేటర్స్ మనుగడ కష్టంగా మారిందంటున్నారు ఎగ్జిబిటర్స్. దీంతో ఈస్ట్, వెస్ట్ తో పాటు నైజాం అంతటా పర్శంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్స్ గట్టిగా పట్టుపడుతున్నారు. వీరికి సురేశ్ బాబు, సునీల్, దిల్ రాజు-శిరీష్ అండ ఉన్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఫిలిమ్ ఛాంబర్ లో 18వ తేదీన ఎగ్జిబిటర్స్ తో భారీ సమావేశం జరగనుంది. ఎగ్జిబిటర్స్ కోరినట్లు పర్శంటేజ్ విధానం అమలులోకి వస్తే పెద్ద సినిమాలకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉంది.

స్టార్స్ కి, టాప్ డైరెక్టర్స్ కు కోట్లకు కోట్లు పారితోషికాలు పెంచుకుంటూ పోతున్న నిర్మాతలు థియేటర్ల మనుగడ చూడటం లేదన్నది ఎగ్జిబిటర్స్ వాదన. ఇదిలా ఉంటే స్టార్స్ వద్ద పారితోషికం తగ్గించమని డిమాండ్ చేస్తే సినిమాలు చేయరని, దానివల్ల రొటేషన్ దెబ్బతింటుందని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ బాధ. అందుకే ఈ విపత్తు నుంచి గట్టెక్కాలని యాక్టివ్ నిర్మాతలు అందరూ ఒక్కటి కాబోతున్నారట. అంతే కాదు సితార, మైత్రీ సంస్థలు కలసి ఇకపై మల్టీప్లెక్స్ లో మాత్రమే సినిమాలు రిలీజ్ చేస్తామంటున్నారట. ఇప్పడు ఎగ్జిబిటర్స్ వెనుక సురేశ్ బాబు, సునీల్, శిరీష్ ఉంటే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ వెనుక మైత్రీ, సితార సంస్థలు నిలబడనున్నాయన్న మాట. అంటే తెలుగు చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా చీలినట్లు భావించాలి. మరి 18వ తేదీన జరిగే సమావేశం ఎలాంటి మలుపులు తిరుగుతుంది. మరి ఏ వర్గానిది పై చేయి అవుతుందో చూడాలి

Updated Date - May 13 , 2025 | 03:07 PM