Tollywood: టాలీవుడ్ మదర్స్ అండ్ డాటర్స్
ABN , Publish Date - May 11 , 2025 | 09:25 AM
ప్రతి యేడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది... ఈ సారి మే 11న మాతృదినోత్సవం... ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమలో నాయికలుగా అలరించిన వారిని, వారి కుమార్తెల తీరును గుర్తు చేసుకుందాం...
ప్రతి యేడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది... ఈ సారి మే 11న మాతృదినోత్సవం.. ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమలో నాయికలుగా అలరించిన వారిని, వారి కుమార్తెల తీరును గుర్తు చేసుకుందాం... Tollywood mothers and Daughters)
చిత్రసీమలోనే కాదు ప్రతి రంగంలోనూ వారసత్వం చిందులు వేస్తోంది... గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా రంగంలో ఆ చిందు మరింతగా కనువిందు చేస్తోందని చెప్పవచ్చు... ఇతరులే తమ పిల్లలు వెండితెరపై వెలిగిపోవాలని కోరుకుంటూ ఉంటే, ఇక సినిమా పరిశ్రమలోనే ఉన్న వారి పరిస్థితి వేరే చెప్పాలా!? ఒకప్పుడు సంప్రదాయ బద్ధంగా నటించి జనాన్ని తన అందచందాలతోనూ అభినయంతోనూ ఆకట్టుకున్న లయ (Laya) ఇప్పుడు తన కూతురు శ్లోక (Sloka)ను చిత్రసీమలో ప్రవేశ పెడుతోంది... బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న 'అఖండ-2'లో లయ కూతురు శ్లోక నటించనుందని విశేషంగా వినిపిస్తోంది... గతంలో బాలయ్య హీరోగా రూపొందిన 'విజయేంద్రవర్మ'లో ఆయనకు జోడీగా నటించారు లయ... ఇప్పుడు లయ కూతురు శ్లోక 'అఖండ-2'లో బాలకృష్ణ కూతురు పాత్రలో కనిపించనుందని టాక్... లయ రూటులోనే సాగడానికి మరికొంతమంది తారలు కూడా తమ కూతుళ్ళను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది...
ఓ నాటి అందాలతార ఖుష్బూ (Khushboo) ఇద్దరు కూతుళ్ళు అవంతిక (Avantika), ఆనందిత (Ananditha) కూడా తెరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యారు. వీరిలో ఆనందిత - కమల్ హాసన్ తో మణిరత్నం తెరకెక్కిస్తోన్న 'థగ్ లైఫ్'లో నటిస్తోంది. కాగా, అవంతిక ఓ యంగ్ హీరో పెయిర్ గా నటించడానికి రెడీ అవుతోంది. ఇక మాజీ మంత్రి, నటి రోజా (Roja) కూతురు అన్షు మాలిక (Anshu Malika) కూడా తెరపై కనిపించడానికి ముస్తాబవుతున్నట్టు సమాచారం. పలు చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ లో అలరించిన సత్య కృష్ణన్ కూతురు అనన్య కూడా మేకప్ వేసుకోనుందని తెలుస్తోంది. వీరే కాదు మరెందరో ముద్దుగుమ్మలు తల్లుల బాటలో పయనిస్తూ తకధిమిథై అనడానికి సిద్ధమని వినికిడి.
ఇప్పటి తారలకంటే ముందుగానే ఎంతోమంది నటీమణులు తమ కూతుళ్ళను నటనలో అడుగుపెట్టేలా చేసి విజయం సాధించారు. వారిలో ఆ నాటి పుష్పవల్లి కూతురు రేఖ, సంధ్య కుమార్తె జయలలిత, జయశ్రీ పుత్రిక జయచిత్ర ముందుగా గుర్తుకు వస్తారు. వీరిలో అందరూ అగ్రనాయికలుగా రాణించినా, అందరిలోకి ప్రత్యేకంగా నిలచినవారు సంధ్య కూతురు జయలలిత (Jayalalitha) అనే చెప్పాలి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అలరించిన జయలలిత తరువాత రాజకీయాల్లోనూ అడుగుపెట్టి తమిళ రాజకీయాలను ఓ మలుపు తిప్పారు... తమిళనాడుకు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు... అందువల్ల చిత్రసీమలో అడుగుపెట్టే ప్రతి హీరోయిన్ కూతురుకు జయలలిత రోల్ మోడల్ గా నిలచారని చెప్పవచ్చు.
అనువాద చిత్రాలలో తెలుగువారిని పలకరించిన సారిక కూతురు శ్రుతిహాసన్ (Shruti Haasan) నాయికగా రాణిస్తున్నారు. తన తండ్రి కమల్ హాసన్ తరం హీరోల సరసన కూడా నటించి మెప్పించారు శ్రుతి. ఓ నాటి మేటి నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా అభినేత్రిగా అలరించారు. ఐశ్వర్య కూతురు అనయన కూడా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. నటి లిజీ అనేక తెలుగు చిత్రాల్లో నటించారు. ఆమె కూతురు కళ్యాణి ప్రియదర్శన్ కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించారు. ఒకప్పటి అందాలతార మంజుల కూతుళ్ళు రుక్మిణి, శ్రీదేవి కూడా హీరోయిన్స్ గా రాణించారు. జీవిత కూతుళ్ళు శివానీ, శివాత్మిక సైతం తల్లి బాటలో పయనిస్తూ హీరోయిన్స్ అయ్యారు. 'పున్నమినాగు'లో చిరంజీవి జోడీగా నటించి ఆకట్టుకున్న మేనక కూతురు కీర్తి సురేశ్ (Keerthi Suresh) 'మహానటి'తో తెలుగువారి మనసు దోచేసింది. అంతేకాదు, అభినయంతో పాటు అందాలతోనూ అలరిస్తోంది కీర్తి సురేశ్...
ఒకప్పుడు తన చిందులతో కనువిందు చేసిన రాధ ఇద్దరు కూతుళ్ళు సైతం తెరపై తళుక్కుమన్నారు. రాధ పెద్ద కూతురు కార్తిక తెలుగు సినిమా 'జోష్'తో పరిచయం కాగా, చిన్నమ్మాయి తులసి 'కడలి' సినిమాతో తొలి అడుగు వేసింది. ఎంతమంది గురించి చెప్పుకున్నా ఎంతోమంది రసికులకు ఈ నాటికీ స్వప్నసుందరిగా నిలచిన తార శ్రీదేవి (Sridevi) అనే చెప్పాలి. ఆమె ఇద్దరు కూతుళ్ళలో పెద్దమ్మాయి జాన్వీ కపూర్ (Jhanvi Kapoor)_ఇప్పటికే నటిగా తనదైన బాణీ పలికిస్తోంది. చిన్నకూతురు ఖుషీ కపూర్ కూడా తల్లి బాటలో నటిగా మారింది. జాన్వీ కపూర్ యంగ్ టైగర్ యన్టీఆర్ 'దేవర'తో తెలుగువారిని పలకరించింది. రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న 'పెద్ది'లోనూ జాన్వీ నాయికగా నటిస్తోంది. సక్సెస్ ఫుల్ గా సాగిన, సాగుతూ ఉన్న హీరోయిన్స్ కూతుళ్ళను ఆదర్శంగా తీసుకొని మరెంతోమంది నాయికల కుమార్తెలు తెరపై వెలిగే ప్రయత్నం చేస్తున్నారు. మరి వారందరినీ వారి తల్లులు ఏ విధంగా తీర్చిదిద్దుతారో - వారిలో ఎంతమంది విజయకేతనం ఎగరేస్తారో చూడాలి...