Tollywood Issues: ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం..
ABN , Publish Date - May 18 , 2025 | 07:04 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్‌బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీలపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. రెంట్ రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు అంటుంటే.. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్టిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు.
గతంలో పర్సంటేజ్ విధానాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
పెద్ద, మీడియం సినిమాలకు 2 శాతం నేగోషియేషన్‌తో.. అంటే 73 శాతం డిస్ట్రిబ్యూటర్, 27 శాతం ఎగ్జిబిటర్ తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు.
30 కోట్లు+ నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 75 శాతం డిస్ట్రిబ్యూటర్, 25 శాతం ఎగ్జిబిటర్, రెండో వారం 55 శాతం డిస్ట్రిబ్యూటర్, 45 శాతం ఎగ్జిబిటర్, మూడో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్, నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్.
10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 60 శాతం డిస్ట్రిబ్యూటర్, 40 శాతం ఎగ్జిబిటర్, రెండో వారం 50 శాతం డిస్ట్రిబ్యూటర్, 50 శాతం ఎగ్జిబిటర్, మూడో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్, నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్.
10 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 50 శాతం డిస్ట్రిబ్యూటర్, 50 శాతం ఎగ్జిబిటర్, రెండో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్, మూడో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్‌కి ఉండేది.