Eesha: 'ఈషా' నాలుగు సార్లు భయపెట్టిందట

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:43 PM

కె.ఎల్. దామోదర ప్రసాద్ సమర్పణలో నిర్మితమైన 'ఈషా' మూవీ డిసెంబర్ 12న రాబోతోంది. ఈ సినిమాను బన్నీ వాస్, నందిపాటి వంశీ విడుదల చేస్తున్నారు. అఖిల్ రాజ్, త్రిగుణ్‌, హెబ్బా పటేల్ ఇందులో కీ-రోల్స్ ప్లే చేశారు.

Eesha Horror Thriller movie

ఇటీవల 'లిటిల్‌హార్ట్స్‌ (Little Hearts), రాజు వెడ్స్‌ రాంబాయి' (Raju Weds Rambai) లాంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' (Eesha) పేరుతో ఓ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల 'రాజు వెడ్స్‌ రాంబాయి'లో హీరోగా నటించిన అఖిల్ రాజ్ (Akhil Raj) తో పాటు త్రిగుణ్‌, హెబ్బా పటేల్ (Hebah Patel) ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అలానే సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కె.ఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌, గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

WhatsApp Image 2025-12-04 at 3.49.33 PM.jpeg


ఈ సందర్భంగా దామోదర ప్రసాద్‌ (K.L. Dhamodara Prasad) మాట్లాడుతూ, 'ఎన్నిసినిమాలు చేసినా, నా ప్రతి సినిమా తొలి సినిమాలా భావిస్తాను. 'ఈషా' దర్శకుడు శ్రీనివాస్‌ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు. సినిమా అంటే ఎంతో పాషన్‌ ఉన్న వ్యక్తి, ఎంతో ఓపిక, ప్రతిభ ఉన్న దర్శకుడు. 24 క్రాఫ్ట్స్‌పై పట్టు ఉన్న వ్యక్తి. వాసు, వంశీ నాకు సోదరుల లాంటి వారు. ఇవాళ సినిమాను థియేటర్‌ వరకు తీసుకెళ్లాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి ప్లానింగ్‌ కావాలి. అది ఇప్పుడు వాసు, వంశీ చేస్తున్నారు' అని అన్నారు.


బన్నీవాస్‌ మాట్లాడుతూ, 'నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా థియేటర్‌లో నాలుగు సార్లు భయపడ్డాను. దర్శకుడు నా లాంటి వాళ్లను భయపెట్టాడంటే కంటెంట్‌లో దమ్ము ఉందనిపించింది. తెలిసి కూడా అందరిని భయపెట్టే సినిమా. అంటే భయపడతారని తెలిసినా భయపడతాం. చివరి పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తకుంటుంది. ఈ మధ్య కాలంలో అరవైకి పైగా సినిమాలు చూశాం. అందులో మూడు సినిమాలు సెలక్ట్‌ చేసుకున్నాను. అందులో ఇది కూడా ఒకటి. దయచేసి హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడొద్దు' అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ 'ఈ సినిమా చూసిన తరువాత నేను ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసి భయపడ్డాను. డిసెంబర్‌ 12న అందర్ని భయపెడుతున్నాం. మాకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఇచ్చిన దామోదర ప్రసాద్‌, నిర్మాతలకు నా థాంక్స్. నేపథ్య సంగీతం అదిరిపోతుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.

Updated Date - Dec 04 , 2025 | 04:46 PM