Pre Wedding Show: ఒక్క నెగెటివ్ కామెంట్ లేదు.. సినిమా పికప్ అవుతోంది
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:21 PM
టాలీవుడ్‌లో కొత్తగా విడుదలైన ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ఎటువంటి బూతులు లేకుండా సహజమైన కామెడీ, హీరో తిరువీర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్విస్తోంది.
టాలీవుడ్‌లో ఈ వారం థియేటర్లలో వచ్చిన నాలుగు సినిమాలలో ‘ప్రీ వెడ్డింగ్ షో’ అనే చిన్న చిత్రం ఎలాంటి హంగు అర్భాటం లుకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తున్న సినిమాగా నిలిచింది. ఎటువంటి బూతు మాటలు లేకుండా సహజమైన హాస్యంతో అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని చూస్తుంటే సినిమాకు వెళ్లినట్టుగా కాకుండా.. ఊర్లోకి వెళ్లినట్టు చూసినట్టుగా ఉందని,‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదే అంటూ సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
హీరో తిరువీర్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటనకు ప్రేక్షకులు చప్పట్లతో స్పందిస్తున్నారు. పెళ్లి ముందు జరిగే సంఘటనలను ఆసక్తికరంగా చూపించిన విధానం అందరినీ కనెక్ట్ అవుతోంది. దర్శకుడు సాధారణ కథనాన్ని నవ్వులతో నింపి, ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చారు. స్నేహితుల మధ్య జరిగే సరదా సంభాషణలు, నేటి యువత జీవనశైలిని ప్రతిబింబించే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యాయి.
నిన్నటి కంటే ఈ రోజు థియేటర్ బుకింగ్స్ మరింతగా పెరిగాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను బట్టి చూస్తే, ఈ సినిమా వారం చివర్లో మరింత బలమైన కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహఙంచి తమ ఆనందాన్ని మీడియాతో పంచుకుంది.
ఈ సందర్భంగా హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘సైరాట్ మూవీ మేకింగ్‌ను డాక్యుమెంటేషన్ చేశారు. అలాగే.. ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మేకింగ్‌ని కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోండని చెప్పాను. చిన్న రూంలోనే సినిమా పనులన్నీ చేసేశారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని మీడియా చాలా సపోర్ట్ చేసింది. ఈ చిత్రం కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. రోహన్ అయితే మా కోసం ఇన్ స్టాలో ఎక్కువగా ప్రమోట్ చేశాడు. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు. మౌత్ టాక్, మౌత్ పబ్లిసిటీతోనే నా సినిమాలు ఆడుతుంటాయి. ఇప్పుడిప్పుడే మా సినిమా పికప్ అవుతోంది. మా చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు థాంక్స్’ అని అన్నారు.