Pavala Syamala: దుర్భరమైన జీవితం.. ఆత్మహత్యాయత్నం చేసిన లేడీ కమెడియన్.. ?
ABN , Publish Date - Dec 10 , 2025 | 07:35 PM
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ డబ్బు, వయస్సు, అవకాశాలు ఉన్నప్పుడే పేరు ప్రఖ్యాతలు వస్తాయి.
Pavala Syamala: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ డబ్బు, వయస్సు, అవకాశాలు ఉన్నప్పుడే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఒక్కసారి అవన్నీ పోయాయి అంటే ఎవరు వారిని పట్టించుకోరు. డబ్బున్నప్పుడు స్టార్ అన్నవారే.. లేనప్పుడు ఎవరు మీరు అని అంటారు. మహానటి సావిత్రికే ఆ గతి తప్పలేదు. ఇక ఇప్పుడు చివరి అంకంలో దీనస్థితిలో బ్రతికించమని కోరుతుంది నటి పావలా శ్యామల (Pavala Syamala). పావలా అనే నాటకంలో నటించి ఆ పేరునే.. ఇంటిపేరుగా మార్చుకుంది నేతి శ్యామల.
ఇక శ్యామల టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. ఆంధ్రావాలా, గోలీమార్ సినిమాల్లో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇక వయస్సు పెరుగుతున్నా కూడా శ్యామల అవకాశాల కోసం తిరుగుతూనే వచ్చింది. డైరెక్టర్లు కూడా ఆమె వయస్సుకు మర్యాద ఇచ్చి ఏదో ఒక పాత్ర ఇస్తూ వచ్చారు. ఇక కొన్నేళ్ల నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కదలలేని స్థితిలో ఉండడంతో ఇండస్ట్రీ ఆదుకోవాలని వీడియో ద్వారా తెలిపింది. ఆమె పరిస్థితికి చలించి.. చాలామంది స్టార్స్ ఆర్థిక సాయం చేశారు. అందులో చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, ఆకాష్ పూరి.. ఇలా కొంతమంది ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆర్థిక సాయం అందించారు.
గత కొంతకాలంగా పావలా శ్యామల, ఆమె కుమార్తె ఒక హోమ్ లో చేరారు. హోమ్ నిర్వాహకులే.. వారి బాగోగులు చూస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో హోమ్ నిర్వాహకులు సైతం సేవలు అందించలేక బయటకు పంపించినట్లు సమాచారం. కనీసం కదలలేని స్థితిలో ఉండడంతో .. అన్ని బెడ్ పైనే జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో అలాంటి సేవలు చేయలేక నిర్వాహకులు.. ఆమెను బయటకు పంపేయడంతో.. ఇలాంటి జీవితం తనకు వద్దు అని పావలా శ్యామల.. తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
రోడ్డుమీద దయనీయమైన పరిస్థితిలో ఉన్న పావలా శ్యామలను పోలీసులు గుర్తించి కార్ఖానా పరిధిలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్లో చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి అస్సలు బాగోలేదని, ఇండస్ట్రీ పెద్దలు ఆడుకుంటే ఇంకొన్నిరోజులు బతుకుతుందని.. ఎవరైనా ఆదుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి పావలా శ్యామలకు ఆపన్న హస్తం ఎవరు అందిస్తారో చూడాలి.