NTR: క్లైమాక్స్ కి చేరుకున్న డ్రాగన్.. లొకేషన్ వేటలో డైరెక్టర్

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:02 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్ (Dragon)' (వర్కింగ్ టైటిల్).

NTR

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్ (Dragon)' (వర్కింగ్ టైటిల్). 'దేవర' వంటి భారీ విజయం తర్వాత తారక్ నటిస్తున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల తిరిగి షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం ప్రస్తుతం పూర్తిస్థాయి పనిలో నిమగ్నమై ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ ని, ప్రత్యేకంగా వర్కవుట్స్ చేస్తూ తన శరీరాకృతిని సైతం మార్చుకున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ హీరోల కళ్లలో ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది. ఎన్టీఆర్ తన నటనతో అదే విధంగా ఆహార్యంతో ఆ తీవ్రతను రెట్టింపు చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ భువన గౌడ అరబ్ దేశమైన జోర్డాన్ లోని 'అమన్' ప్రాంతానికి సంబంధించిన విజువల్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిని బట్టి చూస్తుంటే, సినిమాలోని కీలక సన్నివేశాల కోసం లొకేషన్లను ఫైనల్ చేసే పనిలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లోకేషన్ విజువల్స్ చూసిన అభిమానులు అదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమా కథా నిడివి ఎక్కువగా రావడంతో, దీనిని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దానికి అనుగుణంగానే రెండు పార్టులకు సంబంధించిన షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని కేవలం పాన్ ఇండియా లెవల్‌లోనే కాకుండా, ఒక ఇంటర్నేషనల్ సినిమాగా మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు. దీంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్.. అందిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Updated Date - Dec 31 , 2025 | 05:02 PM