The Great Pre Wedding Show: థియేటర్ లో చూడరు.. ఇప్పుడేమో కల్ట్ క్లాసిక్ అంటారు

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:04 PM

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారో అర్ధం కావడం లేదు. కథ బావుండి.. కుటుంబం మొత్తం కలిసి థియేటర్ లో చూడాల్సిన సినిమాను అవుట్ డేటెడ్, లాగ్.. స్లో ఉంది అని చెప్పుకొస్తున్నారు.

The Great Pre Wedding Show

The Great Pre Wedding Show: ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారో అర్ధం కావడం లేదు. కథ బావుండి.. కుటుంబం మొత్తం కలిసి థియేటర్ లో చూడాల్సిన సినిమాను అవుట్ డేటెడ్, లాగ్.. స్లో ఉంది అని చెప్పుకొస్తున్నారు. అదే కొట్టుకోవడం, నరుక్కోవడం లాంటి సినిమాలను థియేటర్ లో వందరోజులు ఆడిస్తున్నారు. ఇక ఇదే ప్రేక్షకులు ఆ సినిమాలు ఓటీటీలో వస్తే మాత్రం అబ్బా ఏం ఫీల్ గుడ్ మూవీ మావా.. ఎలా థియేటర్ లో చూడకుండా వదిలేశాం.. కల్ట్ క్లాసిక్ రా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఒక చిన్న సినిమా ఓటీటీలో హల్చల్ చేస్తోంది. అదే ది గ్రేట్ ప్రీ- వెడ్డింగ్ షో (The Great Pre Wedding Show).

మసూదతో మంచి హిట్ అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న తిరువీర్ మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది ది గ్రేట్ ప్రీ- వెడ్డింగ్ షో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తిరువీర్ సరసన టీనా శ్రావ్య నటించింది. నవంబర్ 7 న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నా ఆశించిన కలక్షన్స్ ను రాబట్టలేకపోయింది. దీంతో మేకర్స్ .. ఓటీటీ బాట పట్టారు. జీ5 ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. గత శుక్రవారం నుంచి ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక థియేటర్ లో చూడని వారు ఓటీటీలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూసి ఫిదా అవుతున్నారు. సినిమా చాలా బావుందని, కల్ట్ క్లాసిక్ బొమ్మ అని కామెంట్స్ పెడుతున్నారు.నటీనటులు అందరూ చాలా న్యాచురల్ గా చేశారని, ముఖ్యంగా తిరువీర్, బాలనటుడు రోహన్ కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాదిలోనే మంచి సినిమాల్లో ఇది ఒకటి అని, ఇలాంటి సినిమాను థియేటర్ లో చూడకపోవడం తప్పే అని కామెంట్స్ చేస్తున్నారు.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కథ విషయానికొస్తే.. ఒక గ్రామంలో రమేష్(తిరువీర్)ఒక ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. దాని ఎదురుగా ఉన్న పంచాయితీ ఆఫీస్ లో హేమ( టీనా శ్రావ్య) పనిచేస్తుంటుంది. ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఉన్నా బయటకు చెప్పుకోరు. ఇక రమేష్ కి ఆనంద్ (నరేంద్ర రవి)కి, సౌందర్య(యామిని)కి పెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్ కాంట్రాక్ట్ వస్తుంది. ఆనంద్.. ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తుండడంతో చాలా గొప్పగా ఆ షూట్ ఉండాలని చెప్తాడు. అందుకు తగ్గట్టుగానే రమేష్ షూట్ చేస్తాడు.. కానీ, అతని దగ్గర పనిచేసే కుర్రాడు (రోహన్) కెమెరాలో ఉన్న చిప్ ని పోగొడతాడు. దీంతో ఆనంద్ ఏదైనా చేస్తాడేమో అని భయపడి.. ఆ పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ, రమేష్ ఆపకముందే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఆ పెళ్లి ఆగడానికి కారణం ఏంటి.. ? పెళ్లి ఆగిపోయినా కూడా రమేష్ ఎందుకు బాధపడతాడు. చివరికి రామ్మెహన్ - హేమ ఒక్కటి అవుతారా.. ? అనేది కథ. పల్లెటూరుల్లో ఉండే ప్రేమలు, గొడవలు, అమాయకపు ప్రజలు ఇలా అన్నింటిని ఇందులో చూపించారు. ఖాళీ ఉన్నప్పుడు ఈ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Updated Date - Dec 08 , 2025 | 01:28 PM