Telugu Film Industry Strike: నాలుగో రోజూ షూటింగ్స్‌ బంద్‌

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:26 AM

ముప్పై శాతం వేతనాలు పెంచాలన్న తమ డిమాండ్‌ నెరవేరే వరకూ షూటింగ్స్‌లో పాల్గొనేది లేదంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ బంద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సమ్మె ఫలితంగా నాలుగు రోజులుగా షూటింగ్స్‌ ఎక్కడిక్కడ...

ముప్పై శాతం వేతనాలు పెంచాలన్న తమ డిమాండ్‌ నెరవేరే వరకూ షూటింగ్స్‌లో పాల్గొనేది లేదంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ బంద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సమ్మె ఫలితంగా నాలుగు రోజులుగా షూటింగ్స్‌ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఫెడరేషన్‌ ప్రతినిధులతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఫెడరేషన్‌ ముందు నిర్మాతలు నాలుగు ప్రతిపాదనలు ఉంచారు. అవి..ఫ్లెక్సిబుల్‌ కాల్‌షీట్లు(ఉదయం 6 నుంచి సాయ్రంతం 6 గంటల వరకు; ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు) కాల్షీట్లు కావాలి, ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు నాన్‌ మెంబర్స్‌తో కూడా పనిచేయించుకునే వెసులుబాటు ఉండాలి, షూటింగ్‌ ఎక్కడ చేసినా ఎలాంటి పరిమితులు ఉండకూడదూ, రెండో ఆదివారం, పండుగ రోజుల్లో పనికి మాత్రమే డబుల్‌ కాల్‌ షీట్‌, మిగిలిన ఆదివారాల్లో సింగిల్‌ కాల్‌షీట్‌ విధానం... ఈ నాలుగు ప్రతిపాదనలపై ఫెడరేషన్‌ తమ అభిప్రాయం చెబితేనే వేతన పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం ఫెడరేషన్‌ నాయకుడు అనిల్‌ వల్లభనేని మాట్లాడుతూ ‘నిర్మాతల వైపు నుంచి అందిన నాలుగు ప్రతిపాదనలపైనే చర్చ జరిగింది. రెండింటిని అంగీకరించాము. మరో రెండు ప్రతిపాదనలపై యూనియన్‌లో చర్చ జరగాలి. ఈ సమస్యను ఫిల్మ్‌ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లోనే పరిష్కరించుకుంటాం. రెండ్రోజుల్లో ఛాంబర్‌ మీటింగ్‌ ఉండొచ్చు. చిరంజీవి, బాలకృష్ణ అందరికీ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది. నిర్మాతల ప్రతిపాదనలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దినసరి వేతనం తీసుకునే వారు ఎన్ని రోజులు పనిచేస్తారనేది ముఖ్యం. సాఫ్ట్‌వేర్‌ వాళ్లతో సినీ కార్మికులకు పోలిక అనవసరం. నిర్మాతలు, కార్మికులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటారని నమ్ముతున్నాను’ అని అన్నారు.


చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదు: సి.కల్యాణ్‌

ఫెడరేషన్‌ నాయకులు - నిర్మాతల కోర్డినేషన్‌ మీటింగ్‌ జరుగుతుండగానే, చిన్న నిర్మాతలు నిర్మాత సి.కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్మికుల డిమాండ్లపై చర్చించారు. సమావేశం అనంతరం సి.కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘చిన్న చిత్రాలు లేకపోతే ఉపాధి లేదు. చిన్న నిర్మాతలు ఎవరితోనైనా పనిచేయించుకోవచ్చు. చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదు. ఒక్క పైసా కూడా పెంచేందుకు వారు సిద్ధంగా లేరు. అలా అని కార్మికులను ఇబ్బంది పెట్టాలని ఏ నిర్మాత అనుకోరు’ అని చెప్పారు.

5.jpg

నా విమర్శలు వ్యవస్థపైనే: టీజీ విశ్వప్రసాద్‌

సినిమా కార్మికులకు టాలెంట్‌ లేదంటూ అర్థం వచ్చేలా ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ వివరణ ఇచ్చారు. ఈమేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ‘హైదరాబాద్‌లో అపారమైన ప్రతిభ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో పనిచేసే వారు సుమారు 60 శాతం నుంచి 70 శాతం వరకు హైదరాబాద్‌ నుంచే వస్తున్నారు. వీరి పాత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకం. నేను హైదరాబాద్‌ టాలెంట్‌ను తక్కువగా అంచనా వేశానన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు. హైదరాబాద్‌లో టెక్నీషియన్లు, ఆర్టిస్టులు తెలుగు సినిమాకు ఎప్పటి నుంచో అండగా ఉన్నారు. వాళ్లను అడ్డుకునే వ్యవస్థల్ని తొలగించాలి. స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పించాలి’ అని పేర్కొన్నారు.


2-Cj-8-08-2025.jpg

టెక్నీషియన్లు నైపుణ్యం పెంచుకోవాలి: బన్నీ వాస్‌

తెలుగు సినిమా టెక్నీషియన్లకు సరైన నైపుణ్యాలు లేవని, అందుకే బయటి నుంచి నిపుణులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వస్తున్న కామెంట్లపై నిర్మాత బన్నీ వాస్‌ స్పందించారు. ‘సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌ న్యాయమైనదే. వేతనాలు పెంచి మూడేళ్లు అవుతోంది. కార్మికులు ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు. టాలీవుడ్‌ అంతర్జాతీయ స్థాయికెళ్లింది. కానీ, ఎన్ని సినిమాలు ఆ స్థాయిని అందుకుంటున్నాయనేది గుర్తించాలి. అలాంటి పది చిత్రాలను దృష్టిలో పెట్టుకొని లెక్కలేసుకోవడం సరైంది కాదు. ప్రస్తుతం ధరలు పెరిగాయి. ఎంత చిన్న సినిమా అయినా రూ.12 కోట్ల బడ్జెట్‌ అవుతోంది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయితే తప్ప నిర్మాతలకు లాభాలు రావడం లేదు. అలాంటి చిత్రాలు ఎన్ని తీయగలరు? తెలుగు సినిమా టెక్నీషియన్లు తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. పూర్తిగా మనవాళ్లతో అంతర్జాతీయ స్థాయి సినిమా తీయలేం. అందుకే బయటి నుంచి టెక్నీషియన్లను తీసుకొస్తున్నాం. మనవాళ్లు ఆ స్థాయిని అందుకొనే వరకు బయటి వారి రాక తప్పదు’ అని అన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 06:26 AM