Tollywood: సినీ కార్మికుల వేతనాల పెంపు.. ఛాంబర్ ఆదేశాలు జారీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:44 PM
సినీ కార్మికులు వేతనాలు (Tollywood Wages) పెంచాలంటూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దాదాపు 18 రోజులపాటు షూటింగుల బంద్ అనంతరం సినీ పెద్దలు, ప్రభుత్వం చొరవతో సమ్మెను విరమించారు.
సినీ కార్మికులు వేతనాలు (Tollywood Wages) పెంచాలంటూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దాదాపు 18 రోజులపాటు షూటింగుల బంద్ అనంతరం సినీ పెద్దలు, ప్రభుత్వం చొరవతో సమ్మెను విరమించారు. కార్మికుల కోరి మేరకు పలు షరతులతో నిర్మాతలు (Producers) వేతనాలు పెంపునకు అంగీకరించారు. దాంతో షూటింగుల బంద్‌కు తెరపడింది. తాజాగా కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈనెల 22న కార్మిక శాఖ సమక్షంలో 13 కార్మిక సంఘాలు, నిర్మాతలకు మధ్య జరిగిన ఒప్పందం మేరకు 22.5 శాతం వేతనాలు పెంచుతూ నూతన వేతన కార్డును నిర్ణయించినట్లు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది. ఈనెల 22 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 22 వరకు 15 శాతం పెంపును అమలు చేయాలని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది.
సంఘాల వారీగా వేతనాలను సవరిస్తూ నిర్మాతలకు లేఖలు పంపింది. జూనియర్ ఆర్టిస్టులను మూడు విఽభాగాలుగా చేసి ‘ఏ’ కేటగీరిలో రూ.1,420, బి కేటగీరిలో రూ.1,175, సీ కేటగీరిలో రూ.930 ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం అల్పాహారం సమకూర్చకుంటే రూ.70, మధ్యాహ్నం భోజనం సమకూర్చకుంటే రూ.100 అదనంగా ఇవ్వనున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌కు రూ.1,470, హఫ్ కాల్ షీట్‌కు రూ.735 చెల్లించనున్నారు. కాల్ షీట్ సమయం 4 గంటలు దాటిన తర్వాత మాత్రమే పూర్తి వేతనం చెల్లిస్తారని, జీతాలు పని నిబంధనలకు సంబంధించి ఇతర సమస్యలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమిటీకి తెలియజేయాలని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. కమిటీ ఏర్పడే వరకు ప్రతి ఒక్కరూ కార్మిక శాఖ నిర్ణయించిన ఆగస్టు 21 తేదీ నాటి మినిట్స్‌ను అనుసరించాలని నిర్మాతలకు సూచించారు. ఇతర అన్ని వర్కింగ్ కండీషన్స్, అలవెన్సులు 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారమే అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు.