Sirish Comments: అన్నేమో అలా.. తమ్ముడేమో ఇలా.. ఏంటిది దిల్..
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:59 PM
గేమ్ ఛేంజర్ సినిమా పరాజయంపై నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, శంకర్ అభిమానులు శిరీష్ పై మండి పడుతున్నారు.
'గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రంతో మా బతుకు అయిపోయింది అనుకున్నాం..
'సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హోప్ పెరిగింది. నాలుగు రోజుల్లో జీవితం మారింది...
అదే లేకపోతే మా పరిస్థితి ఏమయ్యేది? దిల్ రాజు అయిపోయాడు.. శిరీష్ అయిపోయాడు అనుకునేవారు..
గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది.. హీరో వచ్చి మాకేమన్నా హెల్ప్ చేశాడా? (Sirish Comments)
దర్శకుడు వచ్చి సాయం అందించాడా? కర్టెసీ కోసం కానీసం కాల్ చేసి, ఎలా ఉన్నారని అడగలేదు!
మేం ఇష్టం ఉండి సినిమా తీసుకున్నాం.. డబ్బు పోగొట్టుకున్నాం. ఎవర్నీ బ్లేమ్ చేయడం లేదు.. ఎవరి నుంచీ ఏదీ ఆశించనూ లేదు.. నష్టం వచ్చిందని రెమ్యునరేషన్ వెనక్కి అడిగే స్థాయికి ఎస్‌వీసీ సంస్థ ఇంకా దిగజారలేదు తమ్ముడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్ చేసిన వ్యాఖ్యలివి.
మరో వైపు అన్న దిల్ రాజు ఏమో.. రామ్‌చరణ్‌పై శిరీష్ చేసిన వ్యాఖ్యలను కవర్ చేయడానికి ప్రయత్రాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన తమ్ముడు సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ‘‘ఈ సంవత్సరం మాకున్న చిన్నలోటు గేమ్ ఛేంజర్. రామ్‌చరణ్‌తో సూపర్ హిట్ తీయలేకపోయామనే చిన్న గిల్డ్ ఉంది. త్వరలోనే చరణ్‌తో సూపర్‌హిట్ సినిమా తీయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. దిల్ రాజు ఏ వేదికపై మాట్లాడిన బ్యాలెన్స్‌గానే మాట్లాడారు. కానీ తాజాగా శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం కాస్త ఘాటుగానే మాట్లాడారు. సినిమా ఫ్లాప్ అయితే హీరో, దర్శకుడు కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిద్దరి మాటల్ని సీరియస్‌గా తీసుకున్న రామ్‌చరణ్, శంకర్ అభిమానులు శిరీష్‌ని నెట్టింట ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విపరీతంగా కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు. గతంలో రామ్‌చరణ్‌ను గురించి దిల్ రాజు పొగుడుతూ చెప్పుకొచ్చిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
భారీ అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ నిజంగానే ఫ్లాప్ అయింది. సంక్రాంతి బరిలో నాలుగు రోజుల తేడాతో సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వచ్చి ఎస్‌వీసీ సంస్థను నిలబెట్టింది. 'గేమ్ ఛేంజర్' తెచ్చిన నష్టంలో కొంతవరకూ భర్తీ చేసిందని దిల్ రాజు చెబుతూనే ఉన్నారు. అలాగే కథ విషయంలో హీరో రామ్‌చరణ్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఏమీ లేదని, శంకర్ ఏం చెబితే అదే చేశాడని స్పష్టంగా దిల్ రాజు పలుమార్లు చెప్పుకొచ్చారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రామ్ చరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. గ్లోబల్‌స్టార్ అయిపోయాడాయన. అలాంటి సమయంలో ఈ సినిమా చేయడమే దిల్‌రాజు సంస్థకు లక్ అనుకోవాలి. చరణ్ డేట్స్ కోసం ఎంతో మంది నిర్మాతలు క్యూలో ఉన్నా దిల్ రాజుకి మాత్రమే చరణ్ అవకాశం ఇచ్చారు. అయితే చరణ్ ఇచ్చిన అవకాశాన్ని దిల్ రాజు నిలబెట్టుకోలేదనే చెప్పాలి. కొన్నేళ్లగా శంకర్ ఫ్లాప్స్‌లో ఉన్నారని తెలిసి, ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్‌ను సెట్ చేసుకోవడానికి ఇద్దరితో సినిమా సెట్ చేశారు. చరణ్ మాత్రం దర్శక నిర్మాతల్ని ఇద్దరినీ బలంగా నమ్మడన్నది నిజం.
శంకర్ అంటేనే భారీతనం, భారీ ఖర్చు, భారీ సెట్లు. ఒక్క పాటకే ఆయన కోట్లు ఖర్చు చేస్తారు. దాంతో దిల్ రాజు బడ్జెట్ మారిపోయింది. ఇదే కథ శంకర్ కాకుండా మరో దర్శకుడు అయితే తప్పకుండా మంచి ప్రాఫిట్స్ చూసేవారనే టాక్ కూడా వచ్చింది. అయితే ఈ విషయాన్ని దిల్ రాజు ఎందుకో ఆలోచించకలేకపోయారు. సంక్రాంతి సీజన్‌లో ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు రావడం రేర్‌గా జరుగుతుంది. 2023లో సంక్రాంతి బరిలో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతి కి వస్తున్నాం రెండూ దిల్ రాజు సంస్థ నుంచే వచ్చాయి. చిరంజీవి, చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను సంక్రాంతికి విడుదల చేశాం అంటూ దిల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇప్పుడీ విషయాన్ని శిరీష్ మరిచిపోయినట్లు ఉన్నారు. శిరీష్ మాటల్ని కవర్ చేయడానికే దిల్ రాజు చరణ్‌తో సినిమా ప్రకటించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.